
Vaccination: ఒక్క డోసూ తీసుకోని ప్రభుత్వ ఉద్యోగులకు ‘కెప్టెన్’ షాక్!
చండీగఢ్: కరోనా వ్యాక్సిన్ వేయించుకోని ప్రభుత్వ ఉద్యోగులపై పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ కఠిన ఆంక్షలు విధించారు. అనారోగ్య కారణం మినహా మరే ఇతర కారణంతోనైనా ఇప్పటివరకూ ఒక్క డోసు కూడా వేయించుకోని ఉద్యోగులకు బలవంతపు సెలవులు ప్రకటించారు. అలాంటి ఉద్యోగులందరినీ ఈ నెల 15 తర్వాత సెలవుపై పంపిస్తామని సీఎం స్పష్టంచేశారు. కరోనా మహమ్మారి నుంచి రాష్ట్ర ప్రజలను కాపాడుకోవడమే లక్ష్యంగా ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది.
రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సీఎం అమరీందర్ సింగ్ అధికారులతో శుక్రవారం వర్చువల్‌గా సమీక్షించారు. విశ్లేషించిన డేటా ప్రకారం టీకాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు వ్యాక్సినేషన్‌పై ప్రత్యేక కృషి జరిగిందని, అయినా ఇప్పటికీ కొవిడ్ వ్యాక్సిన్‌కు దూరంగా ఉంటున్న వారిని సెలవుపై పంపాలని ఆదేశించనున్నట్టు తెలిపారు. మరోవైపు, పండుగల సీజన్ కావడంతో కరోనా వ్యాప్తి పట్ల ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, కొవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం అమలవుతున్న కొవిడ్ ఆంక్షలను ఈ నెలాఖరు వరకు పొడిగిస్తున్నట్టు సీఎం వెల్లడించారు.