Film city: ఫిల్మ్‌సిటీ ఏర్పాటుకు కసరత్తు.. ముంబయి చేరుకున్న భగవంత్‌ మాన్‌!

పెట్టుబడులకు గమ్యస్థానంగా పంజాబ్‌ను మార్చేందుకు కృషిచేస్తున్నట్టు సీఎం భగవంత్‌ మాన్‌ అన్నారు. రాష్ట్రంలో ఫిల్మ్‌సిటీ నిర్మించేందుకు కసరత్తు చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు.

Published : 22 Jan 2023 22:37 IST

(ముంబయిలో సీఎం భగవంత్‌ మాన్‌కు స్వాగతం పలుకుతున్న ఆప్‌ శ్రేణులు)

చండీగఢ్‌: పంజాబ్‌(punjab)లో ఫిల్మ్‌సిటీ(Film city) ఏర్పాటు చేసే దిశగా తమ ప్రభుత్వం కసరత్తు చేస్తోందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌(Bhagwant Mann) అన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు(Investments) ఆకర్షించడమే లక్ష్యంగా రెండు రోజుల పర్యటన నిమిత్తం ముంబయి(Mumbai toru) చేరుకున్నారు. ప్రముఖ పరిశ్రమల అధిపతులతో పాటు కొన్ని సంస్థల ప్రతినిధులను కలిసి చర్చించి తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించనున్నారు. 

ముంబయి పర్యటన సందర్భంగా రాష్ట్రంలో ఫిల్మ్‌సిటీ ప్రాజెక్టు ఆలోచన గురించి  మాట్లాడిన భగవంత్‌ మాన్‌.. ముంబయిలో స్థిరపడిన తన స్నేహితులను పంజాబ్‌లో వెంచర్లు ఏర్పాటు చేయాలని కోరనున్నట్టు చెప్పారు. పంజాబీ చలనచిత్ర పరిశ్రమ ఇప్పటికే చాలా పెద్దదని.. దాన్ని మరింతగా విస్తరించేందుకు ఈ ప్రతిపాదిత ఫిల్మ్‌సిటీ మరింత ఊతమిస్తుందన్నారు. తన ముంబయి పర్యటన ఓ వైపు రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి దోహదపడటంతో పాటు మరోవైపు యువతకు కొత్త ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని మాన్‌ ఆశాభావం వ్యక్తంచేశారు. దేశంలోనే అత్యంత ప్రాధాన్యత కలిగిన పెట్టుబడి గమ్యస్థానంగా పంజాబ్‌ ఉందని, కొత్త పెట్టుబడులకు అన్ని విధాలా కృషి చేస్తామని ఈ సందర్భంగా భగవంత్‌ మాన్‌ వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని