Punjab: తుపాకీ సంస్కృతిపై పంజాబ్‌ ఉక్కుపాదం!

తుపాకీ సంస్కృతిపై పంజాబ్‌ ప్రభుత్వం ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఆయుధాల నియంత్రణను కఠినతరం చేసింది. బహిరంగ ప్రదేశాలు, సామాజిక మాధ్యమాల్లో ఆయుధాల ప్రదర్శనతోపాటు తుపాకీ సంస్కృతి, హింసను కీర్తించే పాటలపై నిషేధం విధించింది.

Published : 14 Nov 2022 01:10 IST

చండీగఢ్‌: తుపాకీ సంస్కృతిపై పంజాబ్‌(Punjab) ప్రభుత్వం ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఆయుధాల నియంత్రణను కఠినతరం చేసింది. బహిరంగ ప్రదేశాలు, సామాజిక మాధ్యమాల్లో ఆయుధాల ప్రదర్శనతోపాటు తుపాకీ సంస్కృతి(Gun Culture), హింసను కీర్తించే పాటలపై నిషేధం విధించింది. తుపాకీ లైసెన్సులకు సంబంధించి పలు సూచనలు జారీ చేసింది. ఈ క్రమంలో రాష్ట్రంలో ఇప్పటివరకు జారీ చేసిన అన్ని ఆయుధాల అనుమతులను రానున్న మూడు నెలల్లో సమీక్షించనున్నారు. తప్పుడు వ్యక్తికి ఆయుధ లైసెన్స్ జారీ చేసినట్లు తేలితే.. వెంటనే రద్దు చేస్తారు.

అసాధారణ కారణాలతో ఇవ్వాల్సి వస్తోందని జిల్లా కలెక్టర్ వ్యక్తిగతంగా సంతృప్తి చెందితే తప్ప కొత్తగా గన్‌ లైసెన్సులు మంజూరు కాకుండా చర్యలు తీసుకున్నారు. తొందరపాటు చర్యగా, లేదా నిర్లక్ష్యంగా తుపాకులను ఉపయోగించడం, వేడుకలు ఇతరత్రా కార్యక్రమాల్లో వాటిని పేల్చడం వంటివాటిని శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తారు. ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తారు. అక్రమ తుపాకులు, ఆయుధాల నియంత్రణ కోసం వివిధ ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలూ నిర్వహించనున్నారు. దీంతోపాటు ఏదైనా వర్గంపై ద్వేషపూరిత ప్రసంగాలకు పాల్పడే వారిపైనా కేసు నమోదు చేసి, చర్యలు తీసుకోనున్నారు.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సిద్ధూ మూసేవాలా హత్య కేసుతో మొదలు.. ఇటీవల శివసేన నేత సుధీర్‌ సూరి, డేరా సచ్ఛా సౌదా అనుచరుడు పర్‌దీప్‌ సింగ్‌ హత్య వరకు పంజాబ్‌లో తుపాకుల మోత మోగింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో శాంతిభద్రతల నిర్వహణపై ప్రతిపక్షాల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయుధాల నియంత్రణకు ఆప్‌ ప్రభుత్వం నడుం బిగించింది. పంజాబీ గాయకులు తమ పాటల ద్వారా తుపాకీ సంస్కృతి, గూండాయిజాన్ని ప్రోత్సహించే ధోరణిని సీఎం భగవంత్‌ సింగ్‌ మాన్‌ ఇప్పటికే ఖండించారు. వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని