Navjot Sidhu: ‘ఇదే చివరి అవకాశం.. పంజాబ్‌ తన సమస్యలపై దృష్టి సారించాలి’

పంజాబ్‌ కాంగ్రెస్‌ రాజకీయాల్లో నవజోత్‌ సింగ్‌ సిద్ధూ కొంతకాలంగా కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. కొన్ని రోజుల క్రితం పంజాబ్‌ పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించిన ఆయన.. ఇటీవల రాహుల్‌ గాంధీని కలిసిన అనంతరం దాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు...

Published : 25 Oct 2021 01:33 IST

చండీగఢ్‌: పంజాబ్‌ కాంగ్రెస్‌ రాజకీయాల్లో నవజోత్‌ సింగ్‌ సిద్ధూ కొంతకాలంగా కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. కొన్ని రోజుల క్రితం పంజాబ్‌ పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించిన ఆయన.. ఇటీవల రాహుల్‌ గాంధీని కలిసిన అనంతరం దాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. తాజాగా ఈ వ్యవహారాలన్నీ పక్కన పెట్టాలని.. పంజాబీలు, వారి భవిష్యత్తు తరాలకు సంబంధించిన సమస్యలపై తిరిగి దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన ఈ మేరకు వరుస ట్వీట్లు చేశారు. ‘స్థానిక సమస్యలపై పంజాబ్ తిరిగి దృష్టి సారించాలి. లేకపోతే రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభాన్ని ఎలా ఎదుర్కొంటాం? వాస్తవ సమస్యల విషయంలో నేను కట్టుబడి ఉంటాను. వాటిని నిర్లక్ష్యం చేయను. కోలుకోలేని నష్టం.. లేదా, నష్ట నివారణకు చివరి అవకాశం.. ఈ రెండింటి మధ్య స్పష్టమైన ఎంపిక ఉంది. రాష్ట్ర వనరులు ప్రైవేటు వ్యక్తుల జేబుల్లోకి వెళ్లే బదులు.. రాష్ట్ర ఖజానాకు ఎవరు తిరిగి తెస్తారు? రాష్ట్ర శ్రేయస్సుకు ఎవరు చొరవ చూపుతారు? పంజాబ్ పునరుజ్జీవనానికి సంబంధించిన రోడ్‌మ్యాప్‌పై అడ్డంకులన్నీ తొలగాలి. వాస్తవాలనేవి సూర్యుడిలా ప్రకాశించాలి. స్వార్థ ప్రయోజనాలను కాపాడేవారిని దూరంగా ఉంచండి. పంజాబ్‌ గెలుపునకు దారితీసే అవకాశాలపై దృష్టి సారించండి’ అని రాసుకొచ్చారు. పాకిస్థాన్ జర్నలిస్ట్‌ అరూసా ఆలంతో స్నేహం విషయంలో మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్‌కు, రాష్ట్రానికి చెందిన పలువురు కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న ప్రస్తుత తరుణంలో సిద్ధూ వ్యాఖ్యలు కీలకంగా మారాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు