Agnipath: అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం: పంజాబ్‌ సీఎం

అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ త్వరలోనే రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం తీసుకువస్తామని పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ వెల్లడించారు........

Published : 29 Jun 2022 02:35 IST

చండీగఢ్‌: త్రివిధ దళాల్లో నియామకం కోసం కేంద్రం తీసుకొచ్చిన ‘అగ్నిపథ్‌’(Agnipath)కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. పంజాబ్‌లోనూ నిరసన హోరు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ (Bhagwant Mann) కీలక వ్యాఖ్యలు చేశారు. అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ త్వరలోనే రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం తీసుకువస్తామని వెల్లడించారు. ఈ పథకం ఓ అహేతుక చర్య అని  విమర్శించారు. ‘అగ్నిపథ్ అనేది ఎన్‌డీఏ ప్రభుత్వ విచిత్రమైన అహేతుక చర్య. ఇది భారత సైన్యం పటిష్ఠతను నాశనం చేస్తుంది’ అని వ్యాఖ్యానించారు.

స్వల్పకాలంలో సైనిక నియామకాల నిమిత్తం కేంద్రం తీసుకువచ్చిన ఈ పథకంపై విమర్శలు కొనసాగుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మరోసారి ప్రధాని మోదీపై ధ్వజమెత్తారు. ‘50 సంవత్సరాల పాటు తన స్నేహితులకు విమానాశ్రయాలు కట్టబెట్టి, నరేంద్రమోదీ వారిని దౌలత్‌వీర్‌(ధనవంతులు)గా మార్చుతున్నారు. మరోపక్క నాలుగు సంవత్సరాల కాంట్రాక్ట్‌ పద్ధతిన ఉద్యోగాలు ఇచ్చి యువతను అగ్నివీర్‌గా మార్చుతున్నారు’ అంటూ విమర్శించారు.

దేశ రాజధాని దిల్లీతోపాటు పలు చోట్ల కాంగ్రెస్‌ నేతలు నిరసనలు కొనసాగిస్తున్నారు. మంగళవారం పాట్నాలో యువ నేత కన్హయ్య కుమార్‌ నిరసన చేపట్టగా అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. కొంతమంది యువత ఆయన శిబిరం వద్దకు చేరుకొని అగ్నిపథ్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు. ఇది కాస్తా ఉద్రిక్తతలకు దారితీసింది. కాంగ్రెస్‌ కార్యకర్తలు అడ్డుకోవడంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని