Punjab: ఎమ్మెల్యేను కొట్టిన భర్త.. వీడియో వైరల్‌

దేశంలో మహిళలపై నేరాలు పెరుగుతున్నాయని నివేదికలు చెబుతూనే ఉన్నాయి. తాజాగా పంజాబ్‌లో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేకే

Updated : 02 Sep 2022 10:20 IST

రంగంలోకి మహిళా కమిషన్‌

బఠిండా: దేశంలో మహిళలపై నేరాలు పెరుగుతున్నాయని నివేదికలు చెబుతూనే ఉన్నాయి. తాజాగా పంజాబ్‌లో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేకే అలాంటి అనుభవం ఎదురైంది. అందరూ చూస్తుండగానే ఆప్‌ ఎమ్మెల్యే బల్జిందర్‌ కౌర్‌పై ఆమె భర్త చేయి చేసుకున్నారు. పంజాబ్‌లోని తన నివాసంలో రెండు నెలల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..

పంజాబ్‌లోని తాల్వండి సాబో నియోజకవర్గ ఎమ్మెల్యే బల్జిందర్‌ కౌర్‌.. ఆమె భర్త సుఖ్‌రాజ్‌ సింగ్‌ మధ్య ఏదో కారణంతో వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఆవేశానికి లోనైన సుఖ్‌రాజ్‌ అందరూ చూస్తుండగానే బల్జిందర్‌పై చేయిచేసుకున్నారు. దీంతో పక్కనున్నవారు వెంటనే అడ్డుకుని ఆయనను అక్కడి నుంచి లోపలికి తీసుకెళ్లారు. జులై 10న ఈ ఘటన చోటుచేసుకోగా.. ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. పంజాబ్‌ యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు బ్రిందర్‌ ఈ వీడియో ట్విటర్‌లో పోస్ట్‌ చేస్తూ విచారం వ్యక్తం చేశారు. ఆమెపై చేయి చేసుకోవడం దిగ్భ్రాంతికరమని, ఇకనైనా పురుషుల ఆలోచనాధోరణి మారాలని అకాంక్షించారు.

ఈ ఘటనపై పంజాబ్‌ మహిళా కమిషన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజా సమస్యలను లేవనెత్తే మహిళలు ఇంట్లోనే వేధింపులు ఎదుర్కోవడం దారుణమని పేర్కొంది. ఈ ఘటనను సుమోటోగా పరిగణిస్తూ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. అయితే దీనిపై బల్జిందర్‌ కౌర్‌ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. పోలీసులకు కూడా ఆమె నుంచి ఎలాంటి ఫిర్యాదు రాలేదని సమాచారం.

పంజాబ్‌లోని మఝా ప్రాంతంలో ఆప్‌ యూత్‌ విభాగ కన్వీనర్‌ అయిన సుఖ్‌రాజ్‌తో.. బల్జిందర్‌ కౌర్‌కు 2019 ఫిబ్రవరిలో వివాహమైంది. పాటియాలాలోని పంజాబ్‌ యూనివర్శిటీ నుంచి ఎంఫిల్‌ పూర్తిచేసిన కౌర్‌ రాజకీయాల్లోకి రాకముందు ఇంగ్లిష్‌ ప్రొఫెసర్‌గా పనిచేశారు. తాల్వండి సాబో నుంచి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని