Sidhu Moose Wala: సిద్ధూ మూసేవాలా కేసు.. కాలిఫోర్నియాలో చిక్కిన గోల్డీ బ్రార్‌..!

ఈ ఏడాది మే 29న సిద్ధూ మూసేవాలాను కొందరు దుండగులు పంజాబ్‌లోని మాన్సా జిల్లాలో కాల్చి చంపిన విషయం తెలిసిందే. గ్యాంగ్‌స్టర్‌ గోల్డీ బ్రార్‌ ఆదేశాలతో ఈ హత్య జరిగినట్లు పోలీసుల దర్యాప్తులో తెలిసింది.

Updated : 02 Dec 2022 10:51 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ప్రధాన సూత్రధారి, గ్యాంగ్‌స్టర్‌ గోల్డీ బ్రార్ అమెరికాలో చిక్కినట్లు తెలుస్తోంది. నవంబరు 20నే అతడిని కాలిఫోర్నియాలో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ పరిణామాల గురించి భారత నిఘా సంస్థ ‘రా’, దిల్లీ పోలీసు నిఘా విభాగానికి సమాచారం అందినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై కాలిఫోర్నియా ప్రభుత్వం నుంచి భారత ప్రభుత్వానికి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌కు చెందిన సతీందర్‌జీత్‌ సింగ్‌ అలియాస్‌ గోల్డీ బ్రార్‌ 2017 నుంచి కెనడాలో ఉంటున్నాడు. ఇటీవల అమెరికాకు మకాం మార్చినట్లు సమాచారం. ఈ ఏడాది మే 29న సిద్ధూ మూసేవాలాను కొందరు దుండగులు పంజాబ్‌లోని మాన్సా జిల్లాలో కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఈ హత్యకు గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ కుట్ర పన్నినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ హత్యను కెనడా నుంచి గోల్డీ బ్రార్‌ పర్యవేక్షించాడు. ఈ హత్యకు పాల్పడిన హంతకులకు బ్రార్‌ నుంచి కచ్చితమైన సమాచారం, ఆదేశాలు అందినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. హత్యకు ఒక రోజు ముందు హంతకుల్లో ప్రధాన షూటర్‌ అయిన ప్రియవ్రత్‌ ఫౌజీతో గోల్డీ బ్రార్‌ ఫోన్‌లో మాట్లాడాడని దర్యాప్తులో తేలింది. సిద్ధూతో తమకు వైరం ఉందని, అందుకే అతడిని చంపేసినట్లు తిహాడ్‌ జైలులో ఉన్న బిష్ణోయ్‌ పోలీసుల ఎదుట అంగీకరించినట్లు సమాచారం.

మే 29 సాయంత్రం సిద్ధూ తన స్నేహితులతో కలిసి మాన్సా జిల్లాలోని స్వగ్రామానికి వెళ్తుండగా.. మార్గమధ్యంలో గుర్తుతెలియని వ్యక్తులు అతడిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సిద్ధూను ఆసుపత్రికి తరలించలోపే మృతిచెందాడు. అయితే ఈ హత్యను గోల్డీ బ్రార్‌ పక్కాగా అమలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. సిద్ధూ తన ఇంటి నుంచి ఎలాంటి సెక్యూరిటీ లేకుండా బయటకు వెళ్లినట్లు బ్రార్‌కు సమాచారం అందింది. వెంటనే అతడు షూటర్లకు సమాచారం ఇచ్చారు. దీంతో హంతకుల బృందం రెండు కార్లలో సిద్ధూ వాహనాన్ని వెంబడించింది. ఆ తర్వాత అదను చూసి వారు కాల్పులు జరిపారు. హత్య అనంతరం గోల్డీ బ్రార్‌ మరోసారి హంతకులకు ఫోన్‌ చేసి.. హరియాణాలోని ఫరీదాబాద్‌లో దాక్కోవాలని సూచించాడు. మే 31 నాటికి భీవని జిల్లాకు చేరుకొన్న హంతకులు ఆ తర్వాత జూన్‌ 2 నాటికి గుజరాత్‌లోని ముంద్రాకు వెళ్లిపోయారు. ఈ విషయాలు మొత్తం గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ సోదరులు అనుమోల్‌, కజిన్‌ సచిన్‌ పోలీసులకు వెల్లడించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని