Odisha Train Tragedy: ప్రమాద సమయంలో రైల్లోని దృశ్యాలు వైరల్‌..!

Odisha Train Tragedy: ఒడిశా రైలు దుర్ఘటనతో దేశం మొత్తం చలించిపోయింది. అయితే ప్రమాద సమయంలోని కొన్ని దృశ్యాలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. 

Published : 08 Jun 2023 18:35 IST

బాలేశ్వర్‌: ఒడిశా రైలు దుర్ఘటనతో దేశం దిగ్భ్రాంతికి గురైంది. ప్రయాణికుల రైళ్లు ప్రమాదానికి గురికావడంతో భారీగా ప్రాణనష్టం సంభవించింది. అయితే ఈ ప్రమాదం జరుగుతోన్న సమయంలోని దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.(Odisha Train Tragedy)

బాలేశ్వర్ వద్ద ఘోర ప్రమాదం(Balasore train crash) జరుగుతున్న సమయంలో కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌లోని ఏసీ కోచ్‌లో ఉన్న ప్రయాణికుడు ఒకరు ఈ వీడియో తీసినట్లు తెలుస్తోంది. అప్పుడు పారిశుద్ధ్య కార్మికుడు ఒకరు ఏసీ కోచ్‌ ఫ్లోర్‌ను శుభ్రం చేస్తున్నారు. మరోపక్క కొందరు ప్రయాణికులు నిద్రిస్తున్నారు. ఇంకొంతమంది ముచ్చట్లలో మునిగిపోయారు. అలా ఎవరికి వారు వాళ్ల పనుల్లో ఉండగా.. ఒక్కసారిగా కోచ్‌లో పెద్ద కుదుపు వచ్చింది. దాంతో వెంటనే వీడియో తీస్తున్న వ్యక్తి చేతిలో నుంచి ఫోన్ జారినట్లు తెలుస్తోంది.  దాంతో ఈ వీడియోలోని దృశ్యాలు అంతా గజిబిజిగా మారిపోయి.. ఏం కనిపించకుండా పోయింది. వాటిని చూస్తుంటే.. చిమ్మచీకటి, పెద్ద పెద్ద కేకలు మాత్రమే తెలుస్తున్నాయి. ఆ కుదుపుతో ప్రయాణికులు భయంతో వణికిపోయారు. అయితే ఈ దృశ్యాలు ఒడిశా ప్రమాద ఘటనవే అని చెప్పేందుకు ఎలాంటి అధికారిక ధ్రువీకరణ లేదు. 

గత శుక్రవారం లూప్‌లైన్‌లో ఆగిన గూడ్స్‌ రైలును.. కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఢీ కొట్టింది. దాని బోగీలు ఎగిరి పక్కనున్న పట్టాలపై పడటంతో.. ఆ మార్గంలో వెళ్తోన్న బెంగళూరు-హవ్‌డా కూడా ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 288 మంది మృతి చెందారు. వందల సంఖ్యలో గాయాలపాలయ్యారు. ఇప్పటికీ మృతుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. మరోపక్క.. ఘటనా స్థలిలో పునరుద్ధరణ చర్యలు పూర్తికావడంతో రైళ్ల రాకపోకలు కొనసాగుతున్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని