Uttarakhand: బీటలు వారిన ఇళ్లు.. భయంతో రోడ్లపైనే జనం: జోషిమఠ్ వాసుల దీనస్థితి..!

ఉత్తరాఖండ్‌((Uttarakhand)) జోషిమఠ్ ప్రాంత ప్రజలు రాత్రుళ్లు రోడ్లపైనే ఉంటున్నారు. బీటలు వారిన ఇళ్లలో ఉండే ధైర్యం చేయలేక బయటే చలిలో వణికిపోతున్నారు. 

Updated : 07 Jan 2023 12:36 IST

దేహ్రాదూన్‌: ఉత్తరాఖండ్‌(Uttarakhand)లోని జోషిమఠ్‌ (Joshimath) ప్రజలు భయంతోనే జీవిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం సింగ్‌ధార్‌ వార్డులోని ఓ దేవాలయం కుప్పకూలింది. అలాగే కొన్ని ఇళ్లు కూలిపోయే దశకు చేరుకున్నాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని స్థానిక అధికారులు వెల్లడించారు. శనివారం ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి(Pushkar Singh Dhami) ఈ జోషిమఠ్‌లో పర్యటించనున్నారు. అలాగే 600 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. ప్రజలను తరలించడానికి హెలికాప్టర్లను కూడా సిద్ధంగా ఉంచాలన్నారు. వైద్య సదుపాయాలను అందుబాటులో ఉంచారు.

అసలు అక్కడ భూమి కుంగడానికి గల కారణాలపై అధ్యయనం చేసేందుకు కేంద్రం నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇళ్లు, రోడ్లపై పగుళ్లు రోజురోజుకూ తీవ్రమవుతుండటంతో ప్రజలు భయం గుప్పిట్లోనే జీవిస్తున్నారు. ఈ మార్పుల కారణంగా ఒక హోటల్ భవనం పక్కనున్న భవనంవైపు ఒరిగిపోయింది. దానికింది భాగంలో రోడ్డు మొత్తం బీటలు కనిపిస్తున్నాయి. ఇక ఇళ్లు ఖాళీ చేయాల్సి వచ్చిన వారికి వేరే చోట నివసించేందుకు అద్దె కింద నెలకు రూ.4000 వేలు అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆరు నెలల పాటు ఈ సహాయం అందించనున్నారు. మరోపక్క ఆ ప్రాంతంలో చార్‌ధామ్ రోడ్డు, హైడల్‌ పవర్ ప్రాజెక్టుల పనులను నిలిపివేస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. 

వాతావరణ మార్పులు, నిరంతరం జరుగుతోన్న నిర్మాణరంగ కార్యకలాపాలు ఇందుకు కారణమని స్థానికుల విమర్శలు చేస్తున్నారు. ‘హైడల్ పవర్ ప్రాజెక్టు కోసం సొరంగాలు తవ్వడం ఈ పరిస్థితికి కారణం. రోడ్లను వెడల్పు చేసేందుకు మా ప్రాంతానికి దగ్గరగా ఉన్నబండరాళ్లను కూడా నిత్యం పేలుస్తున్నారు. మా ఇళ్లు ఎప్పుడు కూలతాయో తెలియని భయంలో మేం జీవిస్తున్నాం. గజగజ వణికే చలిలో రాత్రుళ్లు బయటే ఉంటున్నాం. ఎన్నో ఏళ్ల క్రితమే ప్రభుత్వాలు వీటిపై చర్యలు తీసుకోవాల్సింది’ అని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని