Putin: అప్పట్లో ఖర్చుల కోసం క్యాబ్‌ నడిపాను: వ్లాదిమిర్‌ పుతిన్‌

సోవియట్‌ పతనమైన తొలినాళ్లలో ఆదాయం కోసం క్యాబ్‌ నడిపినట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ పేర్కొన్నారు.

Updated : 13 Dec 2021 16:39 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సోవియట్‌ పతనమైన తొలినాళ్లలో ఆదాయం కోసం క్యాబ్‌ నడిపినట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ పేర్కొన్నారు. సోవియట్‌ యూనియన్‌ పతనం ‘చారిత్రక రష్యా’’కు ముగింపుగా ఆయన అభివర్ణించారు. సోవియట్‌ పతనం చాలా మంది ప్రజలకు తీరని విషాద ఘటనగా పుతిన్‌ వెల్లడించారు. రష్యా చరిత్రపై ఓ ఛానెల్‌నిర్మిస్తున్న చిత్రంలో అంశాలుగా వీటిని ప్రభుత్వ రంగ వార్తాపత్రిక ఆర్‌ఐఏ-నొవొస్తి ఆదివారం ప్రసారం చేసింది. దీనిలో పుతిన్‌ మాట్లాడుతూ ‘‘సోవియట్‌ యూనియన్‌ పతనం అంటే.. దాని పేరు కింద ఉన్న చారిత్రక రష్యా పతనమే..’’ అని పేర్కొన్నారు. పుతిన్‌ సోవియట్‌ యూనియన్‌ ఉన్న సమయంలో ఆ దేశ నిఘా సంస్థ కేజీబీలో ఏజెంట్‌గా పనిచేశారు. సోవియట్‌ పతనం తర్వాత ఆయన దిగులుపడ్డాడు. దానిని 20వ శతాబ్దంలో జరిగిన అతిపెద్ద విపత్తుగా అభివర్ణించారు.

సోవియట్‌ పతనం తర్వాత తానుపడిన ఆర్థిక ఇబ్బందులను పుతిన్‌ వెల్లడిస్తున్న దృశ్యాలను ఆర్‌ఐఏ నొవొస్తి ప్రసారం చేసింది. దీనిలో పుతిన్‌ మాట్లాడుతూ ‘‘కొన్ని సందర్భాల్లో అదనపు సొమ్ము అవసరం అయ్యేది. కారు డ్రైవర్‌గా పనిచేసి సంపాదించేవాడిని. కొన్ని నిజాలు చెప్పుకోవడానికి ఇబ్బందికరంగానే ఉంటాయి. కానీ, అవి జీవితంలో జరిగినవే కదా’’ అని పుతిన్‌ వివరించారు. 1991లో ఆర్థిక సంక్షోభం తర్వాత సోవియట్‌ పలు దేశాలుగా విడిపోయి రష్యా  ప్రత్యేక దేశంగా ఏర్పడింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని