Vladimir Putin: స్వీయ నిర్బంధంలోకి రష్యా అధ్యక్షుడు పుతిన్‌!

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ స్వీయ నిర్బంధంలోకి వెళ్తున్నట్టు క్రిమ్లిన్‌ వెల్లడించింది. ఆయన పరివారంలోని ......

Published : 14 Sep 2021 15:41 IST

మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ స్వీయ నిర్బంధంలోకి వెళ్లనున్నట్టు క్రెమ్లిన్‌ వెల్లడించింది. ఆయన పరివారంలోని కొందరికి కరోనా సోకిన నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు  మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. మరోవైపు, ఈ వారంలో తజికిస్థాన్‌లో జరగబోయే ప్రాంతీయ భద్రతా సమావేశాలకు పుతిన్‌ హాజరు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆయన తజికిస్థాన్‌ అధ్యక్షుడు ఎమోమలి రాఖ్‌మాన్‌తో ఫోన్‌లో మాట్లాడినట్టు తెలిపింది. తన సన్నిహిత వర్గాల్లో కొందరు కరోనా మహమ్మారి బారిన పడ్డారని, అందువల్ల తాను నిర్దిష్ట సమయం పాటు స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు ఆయనతో చెప్పారు. అందువల్ల ఈ వారంలో డుషంబేలో జరగబోయే ప్రాంతీయ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనలేకపోతున్నట్టు ఆయనతో చెప్పినట్టు క్రెమ్లిన్‌ ఓ ప్రకటనలో పేర్కొంది.

పుతిన్‌కి ఇప్పటికే వ్యాక్సినేషన్‌ పూర్తయింది. రష్యాలో తయారైన స్పుత్నిక్‌-వీ టీకా రెండో డోసును ఆయన ఏప్రిల్‌లోనే తీసుకున్నారు. సోమవారం ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రష్యన్‌ పారాలింపియన్లతో సమావేశం కావడంతో పాటు బెలారస్‌ సహకారంతో నిర్వహించిన సైనిక విన్యాసాల్లోనూ పాల్గొన్నారు. సిరియా అధ్యక్షుడు బషర్‌ అసద్‌తోనూ ఆయన భేటీ అయ్యారు. అయితే, పుతిన్‌ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని క్రెమ్లిన్‌ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌ అన్నట్టు సమాచారం. కరోనా పరీక్షలు కూడా చేసుకున్నట్టు తెలుస్తోంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని