Anand Mahindra: మాటనిలబెట్టుకున్న మహీంద్రా.. ఆ దివ్యాంగుడికి ఉద్యోగం

మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్రా మరోసారి తన సేవా గుణాన్ని చాటుకున్నారు. ఇచ్చినమాట నిలబెట్టుకుంటూ ఓ దివ్యాంగుడికి తమ సంస్థలో ఉద్యోగం కల్పించారు.......

Published : 03 Feb 2022 02:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సామాజిక మాద్యమాల్లో చురుగ్గా ఉంటూ.. ప్రతిభావంతులకు సాయమందించేందుకు ముందుండే మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్రా మరోసారి తన సేవా గుణాన్ని చాటుకున్నారు. ఇచ్చినమాట నిలబెట్టుకుంటూ ఓ దివ్యాంగుడికి తమ సంస్థలో ఉద్యోగం కల్పించారు. దిల్లీలోని మహీంద్రా ఎలక్ట్రానికి వెహికల్స్ ఛార్జింగ్  కంపెనీలో ఉద్యోగం ఇచ్చినట్లు తెలిపారు.

కాళ్లు, చేతులు సరిగా వృద్ధి చెందని ఓ వ్యక్తి తన లోపాలను అధిగమిస్తూ ఓ ద్విచక్రవాహనాన్ని.. 3 చక్రాల వాహనంగా మార్చుకొని నడుపుతున్న ఓ వీడియో గత డిసెంబర్‌లో  వైరలయ్యింది. ‘నాకు భార్య, ఇద్దరు చిన్న పిల్లలు, ముసలి తండ్రి ఉన్నారు. అందుకే సంపాదన కోసం బయటకు వెళ్తున్నా. అయిదు సంవత్సరాలుగా ఈ వాహనాన్ని నడుపుతున్నా’ అంటూ ఆ దివ్యాంగుడు ఆ వీడియోలో చెప్పుకొచ్చాడు.

ఈ వీడియో కాస్త ఆనంద్‌ మహీంద్రా దృష్టికి వెళ్లడంతో ఆయన అప్పుడే స్పందించారు. ‘ఈ రోజు నా టైమ్‌లైన్‌లో ఈ వీడియో కనిపించింది. ఇది ఎంత పాతదో, ఎక్కడ చిత్రీకరించారో తెలియదు. కానీ.. తన వైకల్యాన్ని ఎదుర్కోవడమే కాకుండా ఉన్నదాంతోనే కృతజ్ఞతా భావంతో మెలుగుతున్న ఈ వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయా’ అని పేర్కొన్నారు. మహీంద్రా లాజిస్టిక్స్‌ సంస్థలోని ఓ ఉద్యోగికి ఈ ట్వీట్‌ను ట్యాగ్‌ చేస్తూ.. ఇతన్ని బిజినెస్ అసోసియేట్‌గా చేర్చగలరా?’ అని అడిగారు. ఆ దివ్యాంగుడికి ఉద్యోగం ఆఫర్‌ చేయడంతో ఈ ట్వీట్‌ కాస్త వైరల్‌గా మారింది. అనంతరం ఆ వ్యక్తిని దిల్లీకి చెందిన బిర్జూ రామ్‌గా గుర్తించారు.

మహీంద్రా సంస్థకు చెందిన ఓ బృందం తాజాగా బిర్జూ రాం ఇంటికి చేరుకొని ఆయనకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆనంద్‌ మహీంద్రా ట్విటర్‌లో పంచుకుంటూ హర్షం వ్యక్తం చేశారు. ‘ఈ జెంటిల్‌మెన్‌ గురించి యూట్యూబ్‌తోపాటు సామాజిక మాధ్యమాల్లో పలు వార్తలు వచ్చాయి. వాటిల్లో నెగెటివ్‌వి కూడా ఉన్నప్పటికీ.. బిర్జూ రాంకు దిల్లీలోని ఎలక్ట్రానిక్‌ వెహికల్స్ ఛార్జింగ్ కంపెనీలో ఉద్యోగం కల్పించినందుకు రామ్‌ అండ్‌ మహీంద్రా లాజిస్టిక్స్‌కి ధన్యవాదాలు. ప్రతిఒక్కిరికి ఓ బ్రేక్‌ అవసరం’ అంటూ ట్వీట్‌ చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని