Rahul Gandhi: జైలు శిక్ష తీర్పు తర్వాత.. లోక్‌సభకు రాహుల్‌ గాంధీ

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) నేడు పార్లమెంట్‌ సమావేశాలకు హాజరయ్యారు. జైలు శిక్ష తీర్పు నేపథ్యంలో ఆయనపై అనర్హత వేటు పడనుందనే వార్తలు వస్తున్న సమయంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. 

Published : 24 Mar 2023 13:13 IST

దిల్లీ: మోదీ ఇంటిపేరును కించపరిచేలా చేసిన వ్యాఖ్యలకు గానూ కాంగ్రెస్‌ (Congress) అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi)కి జైలుశిక్ష పడిన నేపథ్యంలో ఆయనపై అనర్హత వేటు పడే అవకాశాలున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే  శుక్రవారం ఆయన పార్లమెంట్‌ (Parliament)కు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ఉదయం పార్లమెంట్‌ ప్రాంగణంలో జరిగిన పార్టీ ఎంపీల సమావేశానికి రాహుల్‌ హజరయ్యారు. ఆ తర్వాత లోక్‌సభ (Lok Sabha) ప్రారంభం కాగానే ఆ సమావేశంలో పాల్గొన్నారు.

‘దొంగలందరికీ మోదీ అనే ఇంటిపేరే ఎందుకు ఉంటుందో?’ అని 2019లో రాహుల్‌ (Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలపై క్రిమినల్‌ పరువునష్టం కేసు దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన సూరత్‌ కోర్టు ఈ కేసులో ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే, ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం- రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ జైలుశిక్ష పడిన వ్యక్తి.. తీర్పు వెలువడిన తేదీ నుంచి రాజ్యాంగ పదవుల్లో ఉండటానికి, ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేకుండా ఆరేళ్లపాటు అనర్హులుగా ప్రకటిస్తారు. ఈ నేపథ్యంలో రాహుల్‌పై అనర్హత వేటు పడే అవకాశాలున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే  తీర్పుపై అప్పీలును పైకోర్టు అనుమతిస్తే అనర్హత వేటు నుంచి ఆయనకు తాత్కాలికంగా ఊరట లభిస్తుంది. దీంతో ఇప్పుడు రాహుల్‌ సూరత్‌ కోర్టు తీర్పుపై ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశాలున్నాయి.

మరోవైపు, రాహుల్‌ (Rahul Gandhi)కు జైలు శిక్ష పడిన నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ నేడు దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది. దీంతో దేశ రాజధాని దిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.

పార్లమెంట్‌లో వాయిదాల పర్వం..

ఇదిలా ఉండగా.. అదానీ వ్యవహారం సహా పలు అంశాలపై పార్లమెంట్‌ (Parliament)లో ప్రతిపక్షాల ఆందోళనలతో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఈ ఉదయం 11 గంటలకు స్పీకర్‌ ఓం బిర్లా లోక్‌సభను ప్రారంభించగానే అదానీ వ్యవహారంపై నిరసనలు హోరెత్తాయి. దీంతో సెకన్ల వ్యవధిలో సభ గంట పాటు వాయిదా పడింది. అనంతరం 12 గంటలకు సభ తిరిగి ప్రారంభమవ్వగా.. విపక్షాలు మళ్లీ ఆందోళనలకు దిగాయి. అయితే వారి నిరసనల నడుమే స్పీకర్‌ సభను కొనసాగించగా.. పలు బిల్లులను ఆమోదించారు. ఆ తర్వాత ఆందోళనలు తగ్గకపోవడంతో సభ 27వ తేదీ(సోమవారం)కి వాయిదా పడింది. అటు రాజ్యసభలోనూ ఇదే గందరగోళం నెలకొంది. ఈ ఉదయం రాజ్యసభ ప్రారంభం కాగానే కాంగ్రెస్‌ సహా విపక్ష పార్టీల ఎంపీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ సభను మధ్యాహ్నం 2.30 గంటల వరకు వాయిదా వేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని