వ్యవసాయ బిల్లులూ ఆ నోట్ల రద్దు లాగే: రాహుల్‌

నూతన వ్యవసాయ బిల్లులతో కేంద్రం రైతుల జీవితాల్ని నాశనం చేస్తుందని కాంగ్రెస్‌ అగ్రనాయకుడు రాహుల్‌గాంధీ ఆరోపించారు. పంజాబ్‌లోని సంగ్రూర్‌లో ‘ఖేతీ బచావో ట్రాక్టర్‌ ర్యాలీ’లో భాగంగా నిర్వహించిన కిసాన్‌ ర్యాలీలో ఆయన మాట్లాడారు.

Published : 05 Oct 2020 21:58 IST

చండీగఢ్‌: నూతన వ్యవసాయ బిల్లులతో కేంద్రం రైతుల జీవితాల్ని నాశనం చేస్తోందని కాంగ్రెస్‌ అగ్రనాయకుడు రాహుల్‌గాంధీ ఆరోపించారు. పంజాబ్‌లోని సంగ్రూర్‌లో ‘ఖేతీ బచావో ట్రాక్టర్‌ ర్యాలీ’లో భాగంగా నిర్వహించిన కిసాన్‌ ర్యాలీలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మోదీ ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు చేశారు. ‘మోదీ ప్రభుత్వం నోట్ల రద్దుతో చిరువ్యాపారుల జీవితాలను రోడ్డున పడేసింది. ఇప్పుడు వ్యవసాయ బిల్లులతో రైతులు, కూలీలను అదే మాదిరిగా చేయాలని చూస్తోంది. ఈ కరోనా సంక్షోభ సమయంలో ఆగమేఘాల మీద ఆ చట్టాల్ని తీసుకురావల్సిన అవసరం ఏం వచ్చింది’ అని విమర్శించారు.

అదేవిధంగా రాహుల్‌ ఆహార ధాన్యాల సేకరణ, ప్రజా పంపిణీ వ్యవస్థల గురించి మాట్లాడుతూ..‘ఆయా వ్యవస్థల్ని మెరుగు పరచవలసిన అవసరం ఉంది. వ్యవస్థలో ఇంకా చాలా మార్పులు తేవాలి. వ్యవసాయ మార్కెట్లను పెంచాల్సి ఉంది. కనీస మద్దతు ధర విషయంలో రైతులకు కచ్చితమైన హామీలు ఇవ్వాలి. రైతులకు ఉన్నతంగా మౌలిక సౌకర్యాలు కల్పించాలి. కానీ మోదీ ప్రభుత్వం ఇలా వ్యవస్థలను బలోపేతం చేసే చర్యలు చేపట్టడం లేదు. ఎంతసేపు ప్రైవేటీకరణ దిశగా వ్యవస్థల్ని ప్రోత్సహిస్తోంది’ అని విమర్శించారు.  పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సైతం కేంద్ర వ్యవసాయ బిల్లులను తప్పుబట్టారు. తమ ప్రభుత్వం రైతుల ప్రయోజనాల కోసం పోరాడుతోందని చెప్పారు. ఈ బిల్లుల ద్వారా కేంద్రం రైతులకు అన్యాయం చేస్తోందని విమర్శలు గుప్పించారు. 

పార్లమెంటులో ఆమోదం పొందిన వ్యవసాయ బిల్లులకు ఇటీవల రాష్ట్రపతి ఆమోదం లభించిన విషయం తెలిసిందే. దీంతో ముఖ్యంగా పంజాబ్‌, హరియాణా రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని