Congress: పోలీసుల కస్టడీ నుంచి రాహుల్‌ గాంధీ, ప్రియాంక విడుదల.. 6గంటలపాటు నిర్బంధం!

ఆరు గంటల నిర్బంధం అనంతరం పోలీసులు కాంగ్రెస్‌ ప్రధాన నేతలైన రాహుల్‌ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రాను విడుదల చేశారు.........

Published : 05 Aug 2022 22:12 IST

దిల్లీ: పెట్రోల్, నిత్యావసరాలు, జీఎస్టీ పెంపు, అగ్నిపథ్‌ వంటి అంశాలపై కాంగ్రెస్ దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టగా.. ఆ పార్టీ ప్రధాన నేతలైన రాహుల్‌ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రాను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కాగా ఆరు గంటల నిర్బంధం అనంతరం పోలీసులు వారిని విడుదల చేశారు. కాంగ్రెస్‌ ఎంపీలు కూడా విడుదలైనట్లు ఆ పార్టీ నేత జైరామ్‌ రమేశ్‌ ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. శాంతియుతంగా పోరాడుతున్న తమ నేతలను అదుపులోకి తీసుకొని వారిని బంధించినట్లు ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆయా అంశాలపై నిరసన తెలియజేస్తూ.. దిల్లీలో పార్టీ కేంద్ర కార్యాలయం సహా పలు రాష్ట్రాల్లో ఈ కాంగ్రెస్‌ పార్టీ శుక్రవారం ఆందోళనలు చేపట్టింది. ఈ క్రమంలో పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ సహా నేతలంతా నలుపు దుస్తులు ధరించి, నిరసన చేపట్టి పార్లమెంట్‌ వద్దకు ర్యాలీగా వెళ్లారు. ర్యాలీ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడకుండా దిల్లీ యంత్రాంగం నిషేధాజ్ఞలు విధించింది. ఈ నిరసనలకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ నేపథ్యంలోనే పార్లమెంట్ వద్ద ధర్నాకు కూర్చున్న రాహుల్ గాంధీ, అధిర్‌ రంజన్ చౌధురీ, కేసీ వేణుగోపాల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లను దూకి రోడ్డుపై కూర్చుని ప్రియాంక గాంధీ వాద్రా ధర్నా చేపట్టారు. నిషేధాజ్ఞలు ఉండటంతో ఆందోళనను విరమించాలని పోలీసులు ప్రియాంకకు సూచించినా.. ఆమె ఆందోళన కొనసాగించారు. దీంతో మహిళా పోలీసులు ఆమెను బలవంతంగా లాక్కెళ్లి పోలీసు వ్యాన్‌ ఎక్కించారు. అయితే, తమ మహిళా నేతపై పోలీసులు అనుచితంగా, దౌర్జన్యంగా వ్యవహరించారంటూ కాంగ్రెస్‌ నేతలు మండిపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని