Rahul Gandhi: అయిదో రోజు ఈడీ ముందుకు రాహుల్‌ .. కొనసాగుతోన్న కాంగ్రెస్‌ నిరసన

నేషనల్‌ హెరాల్డ్‌(National Herald) కేసులో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ(Rahul Gandhi) నేడు అయిదో రోజు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌(ED) విచారణకు హాజరయ్యారు. ఉదయం 11.20 సమయంలో...

Updated : 21 Jun 2022 14:21 IST

దిల్లీ: నేషనల్‌ హెరాల్డ్‌(National Herald) కేసులో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ(Rahul Gandhi) నేడు అయిదో రోజు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌(ED) ముందు విచారణకు హాజరయ్యారు. ఉదయం 11.20 సమయంలో ఆయన దిల్లీలోని ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఏజెన్సీ కార్యాలయం చుట్టూ పటిష్ఠ పోలీసు, పారామిలిటరీ సిబ్బంది బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కేసులో రాహుల్‌ను ఈడీ అధికారులు గత వారం మూడు రోజులపాటు విచారించిన విషయం తెలిసిందే. సోమవారం నాలుగోసారి హాజరు కాగ.. విడతల వారీగా దాదాపు 12 గంటలకుపైగా సుదీర్ఘ విచారణ కొనసాగింది. మంగళవారం సైతం హాజరుకావాలని ఈడీ ఆదేశించగా.. ఆయన ఈ మేరకు చేరుకున్నారు. ఈ కేసులో ఈడీ అధికారులు రాహుల్‌ను ఇప్పటివరకు 40 గంటలకు పైగా ప్రశ్నించినట్లు సమాచారం.

రాహుల్‌ ఈడీ విచారణను నిరసిస్తూ కాంగ్రెస్‌ శ్రేణులు మంగళవారం సైతం నిరసనలు కొనసాగించాయి. దిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయం నుంచి జంతర్‌మంతర్‌ వరకు ర్యాలీ నిర్వహించాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రశ్నిస్తున్నందునే.. కేంద్రం ఆయన్ను విచారణ పేరిట వేధిస్తోందని నేతలు ఆరోపించారు. దిల్లీలో పార్టీ ఎంపీ అభిషేక్ సింఘ్వీ మాట్లాడుతూ.. ‘అగ్నిపథ్’ నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అయితే, భాజపా అధికార ప్రతినిధి టామ్ వడక్కన్ ఈ వ్యాఖ్యలను ఖండించారు. ‘అగ్నిపథ్ ప్రకటనకు ముందే రాహుల్ గాంధీని ఈడీ విచారణకు పిలిపించింది. ఇప్పుడు దీన్ని కారణంగా చూపుతూ ఈ వ్యవహారాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు’ అని విమర్శించారు. ‘సత్యాగ్రహం’ పేరిట నకిలీ గాంధీలు.. దేశవ్యాప్తంగా విధ్వంసం సృష్టిస్తున్నారని ఆరోపించారు.

ఇదిలా ఉంటే.. నేషనల్‌ హెరాల్డ్‌ పత్రిక మనీ లాండరింగ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ సైతం జూన్‌ 23న ఈడీ ముందు హాజరు కావాల్సి ఉంది. ఇటీవలే సోనియా ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి అయ్యారు. కొవిడ్‌ సోకడంతో దిల్లీలోని గంగారాం ఆస్పత్రిలో చేరిన ఆమె వారం రోజులకుపైగా చికిత్స తీసుకొని కోలుకున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని