Rahul Gandhi: రాహుల్‌ గాంధీకి జైలు శిక్ష.. ఎంపీగా అనర్హుడవుతారా..?

కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీకి (Rahul Gandhi) పరువు నష్టం కేసులో రెండేళ్ల జైలు శిక్ష పడింది. దీంతో ఆయన ఎంపీ  (MP) సభ్యత్వంపై అనర్హత వేటు పడుతుందా అనే విషయం చర్చనీయాంశమయ్యింది. 

Updated : 23 Mar 2023 22:30 IST

దిల్లీ: ‘మోదీ ఇంటి పేరు ఉన్నవారందరూ దొంగలు’ అంటూ రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలపై నమోదైన పరువు నష్టం కేసులో ఆయనకు సూరత్‌ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే, ఆయనకు బెయిల్‌ మంజూరు చేసిన న్యాయస్థానం.. ఈ తీర్పును పై కోర్టులో అప్పీలు చేసుకునేందుకు 30రోజుల గడువిచ్చింది. ఈ నేపథ్యంలో ఆయనపై లోక్‌సభ ఎంపీగా (MP) అనర్హత వేటు పడుతుందా? అనే అంశం చర్చనీయాంశమయ్యింది. నేర నిరూపణ అయితే ఎంపీలు తమ సభ్యత్వం కోల్పోవాల్సి వస్తుందని గతంలో సుప్రీంకోర్టు (Supreme Court) ఇచ్చిన ఆదేశాలను ఉదహరిస్తున్నారు.

ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం, పార్లమెంటు సభ్యులు ఏదైనా కేసులో దోషిగా తేలి.. కనీసం రెండేళ్ల శిక్ష పడితే అనర్హతకు గురవుతారు. దీన్ని బట్టి సూరత్‌ కోర్టు తీర్పును పరిగణనలోకి తీసుకొని లోక్‌సభ సెక్రెటేరియట్‌ రాహుల్‌ గాంధీని అనర్హుడిగా ప్రకటించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, తాజా తీర్పుపై పై కోర్టులో అప్పీలు చేసుకునేందుకు రాహుల్‌ గాంధీకి సూరత్‌ కోర్టు 30రోజులు గడువు ఇచ్చిన నేపథ్యంలో అప్పటివరకు ఆయనపై చర్యలు ఉండకపోవచ్చని చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రస్తుత పార్లమెంటు సమావేశాలకు మాత్రం రాహుల్‌ హాజరు కాకపోవచ్చని భావిస్తున్నారు. భారత ప్రజాస్వామ్యంపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) లండన్‌లో చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని.. అంతవరకు సభలో ప్రసంగించే ప్రసక్తే లేదని భాజపా పట్టుబడుతోన్న విషయం తెలిసిందే.

మరోవైపు లక్షద్వీప్‌కు చెందిన ఎన్‌సీపీ ఎంపీ మొహమ్మద్‌ ఫైజల్‌ను ఓ హత్యాయత్నం కేసులో స్థానిక కోర్టు దోషిగా తేల్చింది. దీంతో అతడిని అనర్హుడిగా ప్రకటిస్తూ లోక్‌సభ సెక్రెటేరియట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. అనంతరం సెషన్స్‌ కోర్టు తీర్పును సవాలు చేస్తూ ఎంపీ ఫైజల్‌ కేరళ హైకోర్టును ఆశ్రయించారు. విచారించిన న్యాయస్థానం తీర్పు అమలును నిలిపివేసింది. తదనంతర పరిణామాల్లో.. ఆయన ఎంపీ సభ్యత్వాన్ని తిరిగి పునరుద్ధరించాలని కేంద్ర న్యాయశాఖ సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో పరువునష్టం కేసులో రాహుల్‌ గాంధీ దోషిగా తేలడంతో ఆయన భవితవ్యం ఏవిధంగా ఉంటుందనే విషయంపై ఉత్కంఠ నెలకొంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని