Anurag Thakur: రాహుల్ కలలో కూడా సావర్కర్‌ కాలేరు..: అనురాగ్‌ ఠాకూర్‌

తాను సావర్కర్‌ కాదంటూ రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలు మరోసారి తీవ్ర దుమారం రేపాయి. దీనిపై కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ తాజాగా స్పందిస్తూ.. కాంగ్రెస్‌ నేతపై మండిపడ్డారు. రాహుల్‌ గాంధీ అబద్ధాల కోరు అనే వాస్తవాన్ని బయటపెట్టే సమయం  వచ్చిందంటూ వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు.

Published : 28 Mar 2023 00:05 IST

దిల్లీ: రాహుల్‌ గాంధీ (Rahul Gandhi)  కలలో కూడా వీర్‌ సావర్కర్‌ (Savarkar) కాలేరని... అలా కావాలంటే దేశం పట్ల ప్రేమ.. బలమైన సంకల్పం, నిబద్ధత, నిస్వార్థం ఉండాలని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ (Anurag Thakur) విమర్శించారు. ‘నేను సావర్కర్‌ను కాదు గాంధీని.. గాంధీలు క్షమాపణలు చెప్పరు’ అని రాహుల్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ఠాకూర్‌ తాజాగా రాహుల్‌పై మండిపడ్డారు. ‘దేశ భక్తుడైన సావర్కర్‌ ఏడాదిలో ఆరు నెలలు విదేశాలకు వెళ్లలేదు. భారతదేశానికి వ్యతిరేకంగా విదేశీయుల సహాయం కోరలేదని’మంత్రి ఘాటు వ్యాఖ్యలు చేశారు. భరతమాతను దాస్య శృంఖలాల నుంచి విముక్తి చేయటం కోసం సావర్కర్‌ బ్రిటన్‌ వెళ్లారని గుర్తుచేశారు. అలాంటి వ్యక్తిపై పదేపదే తప్పుగా వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.  రాహుల్‌ గాంధీ అబద్ధాల కోరు అనే వాస్తవాన్ని బయటపెట్టే సమయం  వచ్చిందంటూ వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు.

ఈ సందర్భంగా సావర్కర్‌ శత జయంతిని పురస్కరించుకుని 1980 మే 20న ఆయనను కొనియాడుతూ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ రాసిన లేఖను  అనురాగ్‌ ఠాకూర్‌  ఈ ట్వీట్‌కు జత చేశారు. ‘దేశం కోసం బ్రిటిష్‌ ప్రభుత్వాన్ని తన ధైర్యసాహసాలతో ఎదుర్కొన్న వీర్‌ సావర్కర్‌ స్థానం ఉద్యమ చరిత్రలో ప్రత్యేకమైనది. భరతమాత ముద్ధు బిడ్డ శత జయంతి వేడుకలు విజయవంతం కావాలని కోరుకుంటున్నాను’అని దివంగత ప్రధాని ఇందిరమ్మ తన లేఖలో పేర్కొన్నారు. ఇందిరా గాంధీ హయాంలో సావర్కర్‌ పరాక్రమాన్ని, త్యాగాన్ని, దేశానికి ఆయన చేసిన నిస్వార్థ సేవను గుర్తించిన అప్పటి ప్రభుత్వం .. ఆయనపై ఒక డాక్యుమెంటరినీ కూడా  విడుదల చేసిన విషయాన్ని గుర్తుచేశారు. అంతే కాకుండా 1923లో కాకినాడలో జరిగిన కాంగ్రెస్‌ సమావేశంలో సావర్కర్‌కు మద్దతు తెలుపుతూ తీర్మానాలు చేశారని అనురాగ్‌ తెలిపారు. ఆయన దేశానికి చేసిన సేవలను గుర్తించి పోస్టల్‌ స్టాంపును కూడా ఇందిరా గాంధీ విడుదల చేశారని గుర్తు చేశారు. ఆ కాలంలోని గొప్ప వ్యక్తులంతా సావర్కర్‌ను గౌరవించారంటే ఆయన ఎంత గొప్ప వ్యక్తో ఊహించుకోవచ్చన్నారు. అలాంటి వ్యక్తిని అవమానించడమంటే రాహుల్‌ ఆయన నానమ్మ, మహాత్మ గాంధీ, భగత్‌ సింగ్, నేతాజీ లాంటి మహనీయులను అవమానించినట్లే అని మంత్రి అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు