Kamal Haasan: మహాత్ముడికి క్షమాపణ చెప్పాలనే ఆ చిత్రం తీశా..!

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, మక్కల్‌ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ మధ్య సోమవారం సుదీర్ఘ సంభాషణ చోటుచేసుకుంది. పలు అంశాలపై వారు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. 

Published : 02 Jan 2023 17:19 IST

దిల్లీ: మహాత్మా గాంధీకి క్షమాపణ చెప్పాలనే ఆలోచన వల్లే ‘హే రామ్‌(Hey Ram)’ చిత్రాన్ని తీసినట్లు ప్రముఖ నటుడు, రాజకీయ నేత కమల్‌ హాసన్‌(Kamal Haasan) వెల్లడించారు. సోమవారం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ(Rahul Gandhi)తో మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్య చేశారు. ఈ రోజు వారిద్దరు పలు అంశాలపై ముచ్చటించారు. గాంధీతో పాటు సినిమా, చైనా దురాక్రమణ, రాజకీయాలు వారి మధ్య చర్చకు వచ్చాయి. పొరుగుదేశాల విషయంలో చైనా,రష్యా ఒకే విధానం అనుసరిస్తున్నాయని ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత కీలక వ్యాఖ్యలు చేశారు. 

‘మా నాన్న కాంగ్రెస్‌కు చెందిన వ్యక్తి. కానీ నేను యుక్తవయస్సులో ఉన్నప్పుడు నా చుట్టూ ఉన్న పరిస్థితుల కారణంగా  గాంధీజీని తీవ్రంగా వ్యతిరేకించాను. అయితే 25 ఏళ్ల ప్రాయంలో నా సొంతంగా గాంధీ గురించి అర్థం చేసుకోవడం ప్రారంభించాను. ఆ తర్వాత ఆయనకు నేను అభిమానిగా మారిపోయా. తర్వాతే నేను ‘హే రామ్’ అనే చిత్రాన్ని తీశాను’ అని కమల్‌ హాసన్‌(Kamal Haasan) వెల్లడించారు. ‘ విమర్శకు అత్యంత దారుణమైన రూపం హత్య చేయడం. ఇది చౌకబారు విధానమని నా అభిప్రాయం’ అని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అలాగే మత సామరస్యం గురించి మాట్లాడుతూ.. అన్ని వర్గాలతో కలిసిన సమాజమే అభివృద్ధి చెందుతుందని అంతా అర్థం చేసుకోవాలని సూచించారు.

మక్కల్‌ నీది మయ్యం అధినేత అయిన కమల్‌ హాసన్ ఇటీవల రాహుల్ గాంధీ(Rahul Gandhi) నిర్వహిస్తోన్న భారత్ జోడో యాత్ర(Bharat Jodo Yatra)లో పాల్గొన్నారు. ఇది ప్రజలకు చేరువవుతోందని ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు. అలాగే రాహుల్‌తో పలు అంశాలపై మాట్లాడిన ఆయన.. చైనా దురాక్రమణ గురించి ప్రశ్నించారు. ‘ఈ 21వ శతాబ్దంలో భద్రత గురించి ప్రపంచ స్థాయి ఆలోచనా విధానం ఉండాలి. ఈ విషయంలో మన ప్రభుత్వం తప్పుడు లెక్కలు వేసిందని నేను భావిస్తున్నాను.  చైనా మన దేశంలోకి చొరబడిందని సైన్యం చెప్తుంటే.. ప్రధాని మోదీ మాత్రం ఎవరు రాలేదంటున్నారు. దీంతో మనం ఏం చేసినా.. భారత్ స్పందించదనే స్పష్టమైన సందేశం చైనాకు వెళ్తుంది’ అని రాహుల్ కేంద్రాన్ని విమర్శించారు. 

రష్యాకు చైనాకు పోలిక తెచ్చిన రాహుల్‌..

ఉక్రెయిన్‌పై రష్యా అనుసరిస్తున్న విధంగానే చైనా కూడా భారత్‌తో వ్యవహరిస్తోందన్నారు. ‘మీరు పశ్చిమ దేశాలతో బలమైన సంబంధాలు కలిగి ఉంటే.. మేం మీ సరిహద్దులను మారుస్తామని ఉక్రెయిన్‌ను రష్యా బెదిరిస్తోంది. చైనా విషయంలో భారత్‌కు ఇదే వర్తిస్తుంది. మీరు ఏం చేస్తున్నారో జాగ్రత్త. మీ భూభాగాలను మారుస్తాం. లద్దాఖ్‌లోకి ప్రవేశిస్తాం. అరుణాచల్‌లోకి వస్తామని చైనా చెప్పడంలో అటువంటి వ్యూహమే కనిపిస్తోంది’ అని గాంధీ కీలక వ్యాఖ్యలు  చేశారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని