Anurag Thakur: ‘రాహుల్‌ గాంధీ పది జన్మలెత్తినా.. సావర్కర్‌ కాలేరు’

రాహుల్‌ గాంధీ పది జన్మలెత్తినా సావర్కర్‌ కాలేరని కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ విమర్శించారు. సావర్కర్‌ను అవమానించినందుకుగానూ రాహుల్‌ను దేశం ఎప్పటికీ క్షమించదని వ్యాఖ్యానించారు.

Published : 02 Apr 2023 15:41 IST

దిల్లీ: ఇటీవల అనర్హత వేటు అనంతరం కాంగ్రెస్‌(Congress) నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) మాట్లాడుతూ.. ‘నా పేరు సావర్కర్‌ కాదు. క్షమాపణలు చెప్పను’ అని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌(Anurag Thakur) మండిపడ్డారు. రాహుల్‌ పది జన్మలెత్తినా సావర్కర్‌(Savarkar)లా మారలేరని పేర్కొన్నారు. దిల్లీ(Delhi)లో ఆదివారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో భాగంగా ఠాకూర్‌ మీడియాతో మాట్లాడారు.

‘సావర్కర్‌ను అవమానించినందుకు రాహుల్ గాంధీని దేశం ఎప్పటికీ క్షమించదు. ఆయన పది జన్మలెత్తినా.. సావర్కర్ కాలేరు. సావర్కర్ తన జీవితమంతా స్వాతంత్య్రం కోసం పోరాడారు. రాహుల్ మాత్రం తన సమయాన్ని.. బ్రిటిషర్ల సాయంతో భారత ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రచారం చేసేందుకే కేటాయించారు’ అని ఠాకూర్‌ విమర్శించారు. మరోవైపు.. బిహార్‌, పశ్చిమ బెంగాల్‌లలో ఇటీవల చెలరేగిన హింసాత్మక ఘటనలు దురదృష్టకరమని పేర్కొన్నారు. బిహార్‌లో జంగిల్‌ రాజ్‌(ఆటవిక పాలన) తిరిగి వచ్చిందని ఆరోపించారు.

‘బిహార్‌లో శాంతిభద్రతలు దిగజారాయి. లాలూ హయాంలో ఉన్న జంగిల్‌ రాజ్.. మళ్లీ నితీశ్‌ కుమార్, తేజస్వీ యాదవ్‌ల హయాంలో తిరిగి రావడం దురదృష్టకరం’ అని ఠాకూర్‌ వ్యాఖ్యానించారు. మరోవైపు బెంగాల్‌లో.. సీఎం మమతా బెనర్జీ నిద్రపోతున్నారని విమర్శించారు. ‘దీదీ నిద్రపోతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆమె కేవలం ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. ఇలాగైతే.. ముఖ్యమంత్రిగా ఉండి ప్రయోజనం ఏంటీ? అని ప్రశ్నించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు