BJP: ‘అదానీతో సంబంధం లేదు.. కర్ణాటక ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే..!’

రాహుల్‌ గాంధీపై అనర్హత వేటుకు, అదానీ వ్యవహారానికి ఎటువంటి సంబంధం లేదని భాజపా సీనియర్‌ నేత రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ఈ విధంగా వ్యవహరిస్తున్నట్లు కాంగ్రెస్‌పై మండిపడ్డారు.

Published : 25 Mar 2023 18:54 IST

పట్నా: అదానీ వ్యవహారం(Adani Row)పై ప్రశ్నించినందుకే కేంద్ర ప్రభుత్వం తనపై అనర్హత వేటు వేసిందని కాంగ్రెస్‌(Congress) అగ్రనేత రాహుల్‌ గాంధీ(Rahul Gandhi) ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే, ఈ వాదనను భాజపా(BJP) ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్(Ravi Shankar Prasad) ఖండించారు. అనర్హత వేటుకు, అదానీ వ్యవహారానికి ఎటువంటి సంబంధం లేదని.. రాహుల్ గాంధీ 2019లోనే పరువు నష్టం వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. దిల్లీలో రాహుల్‌ విలేకరుల సమావేశం ముగిసిన వెంటనే పట్నాలో రవిశంకర్‌ ప్రసాద్ మాట్లాడారు. రాహుల్‌ గాంధీ ఓబీసీలను అవమానించారని, పార్టీ దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిపారు.

రాహుల్‌కు రెండేళ్ల శిక్ష విధిస్తూ.. సూరత్ కోర్టు వెలువరించిన తీర్పుపై స్టే కోసం కాంగ్రెస్‌ ఎలాంటి ప్రయత్నాలు చేయలేదని, కర్ణాటక ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ఈ మేరకు వ్యవహరించినట్లు రవిశంకర్‌ ప్రసాద్‌ ఆరోపించారు. విలేకరుల సమావేశంలో రాహుల్ తప్పుడు ఆరోపణలు చేసేందుకు యత్నించారని, అసలు విషయంపై మాట్లాడలేదని విమర్శించారు. మోదీ ఇంటిపేరును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు.. దూషించడమేనని, అవి విమర్శనాత్మకం కావని అన్నారు.

అంతకుముందు రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ.. అదానీ గురించి అడిగినప్పుడు ప్రధాని మోదీ కళ్లలో భయాన్ని చూశానని, లోక్‌సభలో మరోసారి ప్రసంగిస్తే ఇంకెన్ని నిజాలు బయటపెడతానేమోనని ప్రధాని ఆందోళన చెందారని వ్యాఖ్యానించారు. అందుకే ఇలాంటి కుట్రలకు పాల్పడ్డారని.. ఓబీసీ అని, దేశ వ్యతిరేకి అంటూ అసలు అంశాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అనర్హతల వంటివి తనను ఏమీ చేయలేవని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తాను పోరాడుతూనే ఉంటానని స్పష్టం చేశారు. తనను జైల్లో పెట్టినా.. మోదీకి ప్రశ్నలు వేస్తూనే ఉంటానన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని