Rahul Gandhi: ఉద్యమంలో మరణించిన రైతులు వీరే.. పరిహారం ఇవ్వండి: రాహుల్‌ గాంధీ

సాగు చట్టాలకు వ్యతిరేకంగా సాగించిన ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ మరోసారి డిమాండ్‌ చేశారు

Updated : 07 Dec 2021 17:01 IST

దిల్లీ: సాగు చట్టాలకు వ్యతిరేకంగా సాగించిన ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. దీనిపై నేడు లోక్‌సభలో మాట్లాడిన ఆయన.. అన్నదాతలకు హక్కులు కల్పించాలని, మరణించిన రైతుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కోరారు.

రైతులు, సాగు చట్టాల అంశంపై లోక్‌సభలో నేడు వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టిన రాహుల్‌ గాంధీ.. అనంతరం దీనిపై ప్రసంగించారు. ‘‘ప్రధాని మోదీ తన తప్పును అంగీకరించి.. రైతులకు దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. అయితే ఈ ఉద్యమంలో ఎంతమంది అన్నదాతలు మరణించారని నవంబరు 30న కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని ప్రశ్నించగా.. అందుకు సంబంధించిన డేటా తమ వద్ద లేదని చెప్పారు. కానీ, సాగు చట్టాలపై జరిపిన పోరాటంలో దాదాపు 700 మంది ప్రాణాలు కోల్పోయారు. వారి వివరాలను సభకు అందజేస్తున్నా’’ అని రాహుల్‌ వెల్లడించారు.

‘‘పంజాబ్‌ నుంచి దాదాపు 400 మంది రైతులు ఈ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయారు. వారికి పంజాబ్‌ ప్రభుత్వం రూ.5లక్షల చొప్పున పరిహారం అందించింది. మరణించిన వారిలో 152 మంది రైతుల కుటుంబాల్లో.. ప్రతి కుటుంబం నుంచి ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించింది. హరియాణా నుంచి మరణించిన రైతుల వివరాలు లేవని మీ ప్రభుత్వం చెబుతోంది. ఆ జాబితా కూడా ఇస్తున్నాం. పరిహారం ఇవ్వండి. అన్నదాతలకు హక్కులు కల్పించాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నా’’ అని రాహుల్‌ గాంధీ చెప్పుకొచ్చారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని