Disqualified MPs - MLAs | జైలుశిక్ష పడి.. చట్టసభల సభ్యత్వం కోల్పోయిన నేతలు వీరే!

పరువునష్టం కేసులో రాహుల్‌ గాంధీకి (Rahul Gandhi) రెండేళ్ల జైలు శిక్ష పడింది. దీంతో ఆయన పార్లమెంటు సభ్యత్వంపై అనర్హత (disqualified) వేటు పడింది. ఈ క్రమంలో జైలు శిక్ష పడి, చట్టసభ సభ్యత్వాలను కోల్పోయిన వారు అనేక మంది ఉన్నారు.

Updated : 24 Mar 2023 15:56 IST

దిల్లీ: మోదీ ఇంటి పేరును కించపరిచేలా చేసిన వ్యాఖ్యలకుగానూ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి (Rahul Gandhi) జైలుశిక్ష పడిన నేపథ్యంలో ఆయన పార్లమెంట్‌ సభ్యత్వం (MP)పై అనర్హత వేటు పడింది. అయితే, అప్పీలుకు వెళ్లేందుకు రాహుల్‌కు 30రోజులు గడువు ఉండటంపై కోర్టు నిర్ణయానికి అనుగుణంగా మళ్లీ ఆయన అర్హత పొందే అవకాశాలు ఆధారపడి ఉంటాయి.

ప్రజాప్రాతినిధ్య చట్టం 1951, సెక్షన్‌ 8(3) ప్రకారం.. ఏదైనా కేసులో దోషిగా తేలి, రెండేళ్లకు తగ్గకుండా జైలు శిక్ష పడిన చట్టసభ సభ్యులు (MP/MLAs) తమ సభ్యత్వాన్ని కోల్పోతారు. ఇలా గతంలో తమ లోక్‌సభ, శాసనసభ సభ్యత్వాన్ని కోల్పోయిన నేతలను ఓ సారి పరిశీలిస్తే..

మొహమ్మద్‌ ఫైజల్‌: ఓ హత్యాయత్నం కేసులో లక్షద్వీప్‌ ఎంపీ మొహమ్మద్‌ ఫైజల్‌(Mohammed Faizal)ను అక్కడి సెషన్స్‌ కోర్టు దోషిగా తేల్చింది. దీంతో ఈ ఏడాది జనవరిలో తన పార్లమెంట్‌ సభ్యత్వాన్ని (MP) కోల్పోయారు. అయితే, అనంతరం కేరళ హైకోర్టు స్టే విధించడంతో మళ్లీ ఆయన సభ్యత్వాన్ని పునరుద్ధరించాలని న్యాయశాఖ సిఫార్సు చేసింది.

లాలూ ప్రసాద్‌ యాదవ్‌: దాణా కుంభకోణం కేసులో దోషిగా తేలిన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ (Lalu Prasad Yadav) కూడా తన లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోయారు. కుంభకోణానికి సంబంధించి 2013లో వచ్చిన తీర్పుతో పార్లమెంటుకు దూరమయ్యారు. అనంతరం జైలుకు వెళ్లిన ఆయన.. ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్నారు.

ఆజాం ఖాన్‌: ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాంపుర్‌ మాజీ ఎంపీ, సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజాంఖాన్‌ను (Azam Khan).. 2019లో చేసిన ద్వేషపూరిత ప్రసంగం కేసులో న్యాయస్థానం దోషిగా తేల్చింది. రాంపుర్‌ కోర్టు తీర్పు వెలువరించిన అనంతరం యూపీ అసెంబ్లీ ఆయన్ను అనర్హుడిగా ప్రకటించింది. అంతకుముందు ఎంపీగా ఉన్న ఆయన ఇటీవల ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు.

జయలలిత: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత జయలలిత (Jayalalitha) కూడా జైలు శిక్ష కారణంగా అనర్హతకు గురయ్యారు. అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల జైలుశిక్షతోపాటు రూ.100 కోట్ల జరిమానా కూడా పడింది. దీంతో అనర్హతకు గురైన ఆమె.. సీఎం పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. అనంతరం 2015లో కర్ణాటక హైకోర్టు కింది కోర్టు ఇచ్చిన తీర్పును పక్కనబెడుతూ నిర్దోషిగా ప్రకటించించడంతో.. మళ్లీ సీఎం పగ్గాలు చేపట్టారు. చివరకు ఈ వ్యవహారం సుప్రీం కోర్టుకు చేరింది.

అనర్హత వేటు పడిన ఇతర నాయకులు వీరే

  • మహారాష్ట్ర ఠాణెలోని ఉల్హాస్‌నగర్‌ ఎమ్మెల్యే పప్పూ కలానీ 2013లో ఓ కేసులో దోషిగా తేలడంతో శాసనసభ సభ్యత్వాన్ని కోల్పోయారు.
  • దాణా కుంభకోణం కేసులో నాలుగేళ్ల శిక్ష పడటంతో జేడీయూ నేత, బిహార్‌లోని జహానాబాద్‌ ఎంపీ జగ్‌దీష్‌ శర్మపై అనర్హత వేటు పడింది.
  • కాంగ్రెస్‌కు చెందిన రాజ్యసభ ఎంపీ రషీద్‌ మసూద్‌కు.. ఎంబీబీఎస్‌ సీట్ల కుంభకోణంలో నాలుగేళ్ల శిక్ష పడింది. దీంతో రాజ్యసభ సభ్యుడిగా అర్హత కోల్పోయారు.
  • సూసైడ్‌ కేసుకు సంబంధించి మధ్యప్రదేశ్‌ భాజపా నేత, బిజావర్‌ ఎమ్మెల్యే ఆశా రాణి అనర్హురాలయ్యారు.
  • ఝార్ఖండ్‌ ఎమ్మెల్యే ఎనోస్‌ ఎక్కాకు.. ఓ కేసులో జీవిత ఖైదు పడటంతో ఆయన కూడా తన సభ్యత్వాన్ని కోల్పోయారు.
  • అక్రమాస్తుల కేసుకు సంబంధించి శివసేన ఎమ్మెల్యే బాబన్‌రావ్‌ ఘోలాప్‌నకు మూడేళ్ల శిక్ష పడటంతో 2014లో ఆయన చట్టసభ్యుడిగా అనర్హుడయ్యారు.
  • తమిళనాడుకు చెందిన డీఎంకే నేత, రాజ్యసభ ఎంపీ టీఎం సెల్వగణపతికి ఓ కేసులో రెండేళ్ల శిక్ష పడటంతో పార్లమెంట్‌ సభ్యత్వం కోల్పోయారు.
  • మహారాష్ట్రకు చెందిన భాజపా ఎమ్మెల్యే సురేష్‌ హల్వాంకర్‌కు విద్యుత్‌ దోపిడీ కేసులో మూడేళ్ల శిక్ష పడింది. దీంతో 2014లో ఆయన ఎమ్మెల్యే సభ్యత్వాన్ని కోల్పోయారు.
  • ఝార్ఖండ్‌కు చెందిన లోహర్‌దగ్గా ఎమ్మెల్యే కమల్‌ కిశోర్‌ భగత్‌ కూడా హత్య కేసులో దోషిగా తేలడంతో 2015లో శాసనసభ సభ్యత్వాన్ని కోల్పోయారు.

మరోవైపు ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ జైలుశిక్ష పడిన వ్యక్తి.. తీర్పు వెలువడిన తేదీ నుంచి రాజ్యాంగ పదవుల్లో ఉండటానికి, ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేకుండా ఆరేళ్లపాటు అనర్హులుగా ప్రకటిస్తారు. జైలు శిక్షకాలంతోపాటు మరో ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులు అవుతారు. ప్రజాప్రతినిధులు దోషులుగా తేలిన వెంటనే అనర్హులుగా పరిగణించాలని 2013లో సుప్రీంకోర్టు స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని