Rahul Gandhi: ‘డియర్‌ బ్రదర్స్‌ అండ్‌ సిస్టర్స్‌ ఆఫ్‌ వయనాడ్‌’.. రాహుల్‌ భావోద్వేగ లేఖ

వయనాడ్‌ లోక్‌సభ నియోజకవర్గ ప్రజలను ఉద్దేశిస్తూ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ భావోద్వేగ లేఖ రాశారు.

Published : 23 Jun 2024 20:45 IST

దిల్లీ: తాజా సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలి (Raebareli), కేరళలోని వయనాడ్‌ (Wayanad) స్థానాల్లో విజయం సాధించిన కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) వయనాడ్‌ స్థానాన్ని వదులుకోవాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. త్వరలో అక్కడ జరగబోయే ఉపఎన్నికలో ఆయన సోదరి ప్రియాంక గాంధీ బరిలోకి దిగనున్నారు. ఈ నేపథ్యంలో వయనాడ్‌  ప్రజలను ఉద్దేశిస్తూ భావోద్వేగ లేఖ రాశారు. తన నిర్ణయాన్ని మీడియాకు చెప్పేందుకు చాలా బాధపడినట్టు వెల్లడించారు.  తాను విపత్కర పరిస్థితుల్లో ఉన్న సమయంలో.. వయనాడ్‌ ప్రజల ప్రేమాభిమానాలే కాపాడాయని అన్నారు. తనకు ఆశ్రయం కల్పించి, ఓ కుటుంబ సభ్యుడిలా చూసుకున్నారన్నారు.

‘‘డియర్‌ బ్రదర్స్‌ అండ్‌ సిస్టర్స్‌ ఆఫ్‌ వయనాడ్‌.. మీరంతా క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. నేను నా నిర్ణయాన్ని మీడియా ఎదుట చెప్పేటప్పుడు నా కళ్లల్లో బాధను మీరంతా చూసే ఉంటారు. నేను ఎందుకు బాధపడ్డానో తెలుసా? మీ మద్దతు కోరుతూ ఐదేళ్ల క్రితం మిమ్మల్ని కలిశాను. అప్పటికి నేను మీకు పెద్దగా పరిచయం లేకపోయినా.. అందరూ నన్ను నమ్మి గెలిపించారు. అవధుల్లేని ప్రేమాభిమానాలు కురిపించారు. మీరు ఏ వర్గానికి చెందిన వారైనా, ఏ రాజకీయ పార్టీకి మద్దతిచ్చినా, రోజు రోజుకీ నాపై వేధింపులు ఎక్కువైనప్పుడు అండగా నిలిచారు. మీ అనిర్వచనీయమైన ప్రేమే నన్ను రక్షించింది. 

వరదల సమయంలో ఎదురైన పరిస్థితులను ఎప్పటికీ మర్చిపోలేను. ఒక్కో కుటుంబం తమ జీవితాలను కోల్పోయినా, యావదాస్తులు గంగలో కొట్టుకుపోయినా మీలో ఒక్కరు కూడా హుందాతనాన్ని కోల్పోలేదు. మళ్లీ నన్ను గెలిపించారు. మీ అంతులేని ప్రేమను ఎప్పటికీ గుర్తుంచుకుంటా. వేలాది మంది ప్రజల ఎదుట నా ప్రసంగాలను అనువాదం చేసిన ధైర్యసాహసాలు కలిగిన ధీర యువతుల విశ్వాసాన్ని ఎలా మర్చిపోగలను? పార్లమెంట్‌లో మీ తరఫును గొంతు వినిపించడం నిజంగా ఎంతో సంతోషాన్ని, గౌరవాన్ని ఇచ్చింది.

ఎంతో బాధగా ఉన్నా, వెళ్లక తప్పడం లేదు. మీ అందరి తరఫున పోరాడేందుకు నా సోదరి ప్రియాంక గాంధీ ఉన్నారు. మీరు ఆమెకు అవకాశం ఇస్తే.. మీ ఎంపీగా అద్భుతంగా పని చేస్తారన్న నమ్మకం నాకుంది. రాయ్‌బరేలీలోనూ ఇక్కడిలాగే ఆదరాభిమానాలు చూపించే ప్రజలున్నారు.మీకూ, రాయబరేలి ప్రజలకు ఒకే మాట ఇస్తున్నా.. దేశంలో వ్యాప్తి చెందుతున్న విద్వేషం, హింసపై పోరాడి వాటిని ఓడిస్తా. అత్యవసర సమయంలో మీరు చూపించిన ప్రేమాభిమానాలకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు. మీరంతా నా కుటుంబ సభ్యులే. మీ అందరికీ ఎప్పుడూ అండగా ఉంటా.. ధన్యవాదాలు’’ అంటూ లేఖ ముగించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని