Rahul Gandhi: రాహుల్‌ గాంధీ నకిలీ వీడియో..! భాజపా ఎంపీలపై కేసు

సీనియర్‌ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)కి సంబంధించిన ఓ నకిలీ వీడియో(Fake Video)ను సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకున్నారంటూ కాంగ్రెస్‌(Congress) పార్టీ చేసిన ఫిర్యాదుపై.. భాజపా(BJP) ఎంపీలు రాజ్యవర్ధన్ సింగ్...

Published : 05 Jul 2022 01:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రాహుల్ గాంధీ(Rahul Gandhi)కి సంబంధించిన ఓ నకిలీ వీడియో(Fake Video)ను సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకున్నారంటూ కాంగ్రెస్‌(Congress) పార్టీ చేసిన ఫిర్యాదుపై.. భాజపా(BJP) ఎంపీలు రాజ్యవర్ధన్ సింగ్ రాఠోడ్(Rajyavardhan Singh Rathore), సుబ్రత్ పాఠక్‌లపై కేసు నమోదైంది. కాంగ్రెస్‌ పార్టీ సోమవారం ఈ విషయాన్ని వెల్లడించింది. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో ఈ ఎంపీలతో పాటు మరో ముగ్గురిపై ఎఫ్‌ఐఆర్ నమోదైందని పార్టీ మీడియా బృందం చీఫ్ పవన్ ఖేరా తెలిపారు. దిల్లీ, ఝార్ఖండ్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఉత్తర్‌ప్రదేశ్‌లలోనూ వారిపై ఫిర్యాదులు చేశామని వెల్లడించారు. మరోవైపు.. రాహుల్ గాంధీపై తప్పుడు వార్తలను ప్రచారం చేసినందుకు సంబంధిత నేతలపై చర్యలు తీసుకోవాలని, వారి సామాజిక మాధ్యమాల ఖాతాల నుంచి ఆ వీడియోను తొలగించాలని కోరుతూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌.. భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డాకు లేఖ రాశారు.

‘ఇటీవల కేరళ పర్యటనలో భాగంగా రాహుల్‌ గాంధీ ఓ చోట మాట్లాడుతూ.. వయనాడ్ కార్యాలయంపై దాడి చేసిన వారిని చిన్నపిల్లలుగా అభివర్ణించారు. వారిపై తనకు ఎలాంటి దురుద్దేశాలు లేవని చెప్పారు. ఈ వీడియోను.. ఉదయ్‌పుర్ దర్జీ హత్య ఘటనకు అన్వయిస్తూ.. నిందితులను రాహుల్‌ క్షమిస్తున్నారనే అర్థం వచ్చేలా ఓ ఛానెల్ ప్రసారం చేసింది’ అని కాంగ్రెస్‌ ఆరోపించింది. రాజ్యవర్ధన్ సింగ్ రాఠోడ్ దేశద్రోహానికి పాల్పడ్డారని పార్టీ సోషల్‌ మీడియా ఇన్‌ఛార్జి సుప్రియ ఆరోపించారు. దేశంలో మత సామరస్యానికి భంగం కలిగించే ఉద్దేశంతో ఒక కేంద్ర మాజీ మంత్రి తప్పుడు వార్తలను ప్రచారం చేస్తే.. అది దేశద్రోహమే అవుతుందని ఆమె పేర్కొన్నారు. నకిలీ వార్తలకు ప్రచారం కల్పించేవారికి భాజపాలో ప్రమోషన్లు వస్తాయని విమర్శించారు. రాహుల్ గాంధీ, ఇతర పార్టీ నేతలను ఉగ్రవాదులతో ముడిపెట్టే ప్రయత్నం కూడా జరుగుతోందని ఆమె ఆరోపించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని