Rahul Gandhi: పార్లమెంట్ సమావేశాలకు రాహుల్‌ గాంధీ దూరం..!

వచ్చే వారం నుంచి జరగబోయే పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలకు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ హాజరయ్యే అవకాశాలు కన్పించట్లేదు.

Published : 03 Dec 2022 11:41 IST

దిల్లీ: ‘భారత్‌ జోడో యాత్ర’కు నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ.. వచ్చే వారం నుంచి జరగబోయే పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలకు దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు జైరాం రమేశ్, దిగ్విజయ్‌ సింగ్ వంటి పార్టీ సీనియర్‌ నేతలు కూడా ఈ సమావేశాలకు హాజరుకావట్లేదని కాంగ్రెస్‌ వర్గాల సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో జోడో యాత్రకే అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని హస్తం పార్టీ అధిష్ఠానం భావిస్తోందని సదరు వర్గాలు పేర్కొన్నాయి. అందుకే, శీతాకాల సమావేశాలను పక్కనబెట్టి మరీ.. సీనియర్‌ నాయకులు యాత్రలోనే కొనసాగాలని నిర్ణయించినట్లు తెలిపాయి.

ఇదిలా ఉండగా.. శీతాకాల సమావేశాల ప్రారంభానికి ముందు కాంగ్రెస్‌ కీలక సమావేశానికి సిద్ధమైంది. శనివారం సాయంత్రం 4 గంటలకు అగ్రనేత సోనియా గాంధీ అధ్యక్షతన పార్టీ వ్యూహాత్మక కమిటీ సమావేశం కానుంది. ఈ భేటీలో రాజ్యసభలో ప్రతిపక్ష నేతను ఎన్నుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి.

మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి పోటీ చేసిన సమయంలో రాజ్యసభలో ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేశారు. పార్టీ ‘ఒకే వ్యక్తి.. ఒకే పదవి’ నిబంధన మేరకు ఆయన ఈ బాధ్యతల నుంచి వైదొలిగారు. దీంతో శీతాకాల సమావేశాలకు నూతన ప్రతిపక్ష నేతను ఎన్నుకోవాల్సిన అసవరం ఏర్పడింది. అయితే, ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఈ సమావేశాలు పూర్తయ్యేవరకు ఖర్గేనే ప్రతిపక్ష నేతగా కొనసాగించాలని పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ, ఇందుకు ఏకాభిప్రాయం కుదరకపోతే.. ప్రతిపక్ష నేత పదవికి ఎంపీలు చిదంబరం, దిగ్విజయ్‌ సింగ్‌, జైరాం రమేశ్ పేర్లు వినిపిస్తున్నాయి. డిసెంబరు 7వ తేదీ నుంచి పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని