Jodo Yatra: రాజస్థాన్‌ సంక్షోభ వేళ.. రాహుల్ బంతాట..!

రాజస్థాన్‌లో ముఖ్యమంత్రి పీఠం కోసం రెండు వర్గాల మధ్య ఘర్షణ.. అక్కడ సంక్షోభానికి దారితీసింది.

Published : 27 Sep 2022 01:47 IST

పాలక్కాడ్: రాజస్థాన్‌లో ముఖ్యమంత్రి పీఠం కోసం రెండు వర్గాల మధ్య ఘర్షణ.. అక్కడ సంక్షోభానికి దారితీసింది. సీఎం కుర్చీని వదులుకోవడానికి ఇష్టపడని అశోక్‌ గహ్లోత్‌, దానిపై ఎలాగైనా కూర్చోవాలని ఎదురుచూసే సచిన్‌ పైలట్‌ వర్గాల మధ్య పోరు భగ్గుమంటోంది. ఈ అంతర్గత కుమ్ములాటను ఎలా పరిష్కరించాలో తెలియక అధిష్ఠానం తల పట్టుకుంది. ఈ సమయంలో హస్తం పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్‌గా మారింది. 

కాంగ్రెస్  భారత్‌ జోడో యాత్రలో భాగంగా రాహుల్ కేరళలో పర్యటిస్తున్నారు. ప్రజలను పలకరిస్తూ.. పాదయాత్రను సాగిస్తున్నారు. ఈ క్రమంలో  మార్గం మధ్యలో పిల్లలతో కలిసి బంతాట ఆడారు. ఉదా రంగు దుస్తులు ధరించి కొందరు బాలురు రాహుల్‌తో సాగుతూ.. ఫుట్‌బాల్‌ ఆడారు. ఆయనకూడా బంతి విసిరి వారిని ఉత్సాహపరిచారు. ఈ వీడియోను కాంగ్రెస్‌ ట్విటర్‌లో షేర్ చేస్తూ.. ‘ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దాలి. అందుకోసం ప్రతి అడ్డంకిని ఎదుర్కోవాలి’ అని వ్యాఖ్యను జోడించింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. రాజస్థాన్‌ సంక్షోభ వేళ.. వెలుగులోకి వచ్చిన ఈ దృశ్యాలపై నెటిజన్లు విమర్శనాత్మకంగా స్పందిస్తున్నారు. 

జోడో యాత్ర 150 రోజుల పాటు 3 వేలకు పైగా కిలోమీటర్ల మేర సాగనుంది. సెప్టెంబర్ ఏడున ఇది తమిళనాడులో కన్యాకుమారి నుంచి ప్రారంభమైంది. జమ్మూకశ్మీర్‌తో ముగియనుంది. ప్రస్తుతం కేరళలో సాగుతోన్న ఈ యాత్ర.. అక్టోబర్‌ ఒకటికి కర్ణాటకకు చేరుకోనుంది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని