
Rahul Gandhi: ‘నన్ను వెళ్లనీయట్లేదు’.. ఎయిర్‌పోర్టులో రాహుల్ గాంధీ ధర్నా
లఖ్‌నవూ: లఖింపుర్ ఖేరి ఘటనలో బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు యూపీ ప్రభుత్వం అనుమతినిచ్చినా.. యూపీ పోలీసులు తమను ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వెళ్లనివ్వడం లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. సొంత వాహనంలో లఖింపుర్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వట్లేదన్న ఆయన.. విమానాశ్రయంలో ధర్నా చేపట్టారు. దీంతో లఖ్‌నవూ ఎయిర్‌పోర్టులో హైడ్రామా నెలకొంది.
లఖింపుర్ ఖేరి వెళ్లేందుకు రాహుల్ నేతృత్వంలోని కాంగ్రెస్ నేతల బృందం ఈ మధ్యాహ్నం లఖ్‌నవూ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా ఘటనాస్థలానికి వెళ్లాలని భావించింది. ఇందుకోసం తమ సొంత వాహనాన్ని ఉపయోగించుకుంటామని కాంగ్రెస్ నేత చెప్పగా.. పోలీసులు అందుకు అంగీకరించలేదు. పోలీసు వాహనంలోనే వెళ్లాలని చెప్పారు. దీంతో పోలీసులు, ఎయిర్‌పోర్టు భద్రతా సిబ్బందితో రాహుల్ వాగ్వాదానికి దిగారు. ‘‘నాకు వాహనం ఏర్పాటు చేయడానికి మీరెవరు? ఏ రూల్ ప్రకారం మీరు నా ప్రయాణాన్ని నిర్ణయిస్తున్నారు? నేను నా కారులోనే వెళ్తాను’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇందుకు పోలీసులు అంగీకరించకపోవడంతో ఎయిర్‌పోర్టులోనే ధర్నా చేపట్టారు. ‘‘నన్ను ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వెళ్లనివ్వట్లేదు. ఇదేనా మీరు నాకు ఇచ్చిన అనుమతులు? యూపీ ప్రభుత్వం అనుమతులు ఎలా ఉన్నాయో చూడండి’’ అంటూ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అనంతరం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆయన వాహనంలోనే వెళ్లేందుకు పోలీసులు అనుమతించారు. దీంతో రాహుల్ తన వాహనంలోనే లఖింపుర్ బయల్దేరారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.