Rahul Gandhi: కారు దిగి.. ట్రక్కు ఎక్కి.. డ్రైవర్ల ‘మన్‌కీ బాత్‌’ విని!

కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ తాజాగా ఓ ట్రక్కులో ప్రయాణించారు. సోమవారం రాత్రి దిల్లీ నుంచి చండీగఢ్‌ వెళ్తున్న ఆయన.. మార్గమధ్యంలో కారు దిగి, ఓ ట్రక్కు ఎక్కారు.

Published : 23 May 2023 14:03 IST

దిల్లీ: ‘భారత్‌ జోడో యాత్ర’లో భాగంగా ప్రజలతో మమేకమైన కాంగ్రెస్‌ (Congress) అగ్ర నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi).. ఊహించని విధంగా తాజాగా ఓ ట్రక్కు (Truck)లో ప్రత్యక్షమయ్యారు. సోమవారం రాత్రి దిల్లీ (Delhi) నుంచి చండీగఢ్‌ వెళ్తున్న ఆయన.. మార్గమధ్యంలో కారు దిగి, ఓ ట్రక్కు ఎక్కి ప్రయాణించడం (Rahul Gandhi Truck Journey) గమనార్హం. అనుకోని అతిథి రాకతో.. ఆ డ్రైవర్లంతా ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు. లారీలో డ్రైవర్‌ పక్కన కూర్చోవడం, ఓ దాబా వద్ద డ్రైవర్లతో మాటామంతీ తదితర దృశ్యాలను కాంగ్రెస్‌ పార్టీ ట్విటర్‌ వేదికగా పోస్ట్‌ చేసింది. మరోవైపు.. ప్రయాణంలో భాగంగా రాహుల్‌ గాంధీ.. అంబాలా- చండీగఢ్ జాతీయ రహదారి వెంబడి అంబాలా నగరంలోని గురుద్వారానూ సందర్శించారు.

‘ట్రక్కు డ్రైవర్ల సమస్యలను తెలుసుకునేందుకు రాహుల్‌ వారి మధ్యకు చేరారు. ఈ క్రమంలో దిల్లీ నుంచి చండీగఢ్‌ వరకు ప్రయాణించారు. దేశవ్యాప్తంగా సుమారు 90 లక్షల మంది లారీ డ్రైవర్లు ఉన్నారు. వారికి ఆయా సమస్యలు ఉన్నాయి. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ వారి ‘మన్‌కీ బాత్’ విన్నారు’ అని కాంగ్రెస్‌ పార్టీ ట్వీట్‌ చేసింది. లారీ డ్రైవర్ల సమస్యలను పరిష్కరించేందుకు సాధ్యమైనంత మేర కృషి చేస్తానని రాహుల్‌ హామీ ఇచ్చినట్లు సమాచారం. తన తల్లి సోనియా గాంధీని కలిసేందుకు శిమ్లా వెళ్తుండగా.. ట్రక్కు డ్రైవర్ల సమస్యలు వినేందుకు ఈ ప్రయాణం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అంతకుముందు కర్ణాటక ఎన్నికల సమయంలోనూ రాహుల్‌.. బెంగళూరులో ఓ ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన విషయం తెలిసిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని