Rahul Gandhi: బ్రిటన్‌ పార్లమెంట్‌లో ప్రసంగించనున్న రాహుల్‌ గాంధీ..!

ఇంగ్లాండ్‌ పర్యటనలో ఉన్న కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi).. ఆ దేశ పార్లమెంట్‌లో ప్రసంగించనున్నారు. యూకే ఉభయసభల ఎంపీలను ఉద్దేశించి కీలక ప్రసంగం చేయనున్నట్లు కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడించాయి.

Published : 04 Mar 2023 11:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కాంగ్రెస్‌ (Congress) అగ్రనేత, ఎంపీ రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) ఇంగ్లాండ్‌లో బిజీబిజీగా గడుపుతున్నారు. 10 రోజుల పర్యటన నిమిత్తం బ్రిటన్‌  (Britain) వెళ్లిన ఆయన.. పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కాగా.. ఈ పర్యటనలో ఆయన బ్రిటన్‌ పార్లమెంట్‌ (Parliament)లో ప్రసంగించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మార్చి 6వ తేదీన వెస్ట్‌మినిస్టర్‌ ప్యాలెస్‌లోని గ్రాండ్‌ కమిటీ రూమ్‌లో యూకే (UK) ఉభయ సభల ఎంపీలను ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నట్లు కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడించాయి. దీనిపై భారత సంతతికి చెందిన యూకే ఎంపీ వీరేంద్ర శర్మ స్పందిస్తూ.. ‘‘కేవలం రాజకీయాలపై మాత్రమే గాక, ఇరు దేశాల మధ్య ఉన్న సంస్కృతి, సామాజిక, వ్యాపార బంధంపై రాహుల్ ప్రసంగం ఉండనుంది’’ అని తెలిపారు.

ప్రఖ్యాత కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయంలో ఎంబీఏ విద్యార్థులనుద్దేశిస్తూ రాహుల్‌ (Rahul Gandhi) ప్రసంగించిన విషయం తెలిసిందే. పర్యటనలో భాగంగా ఆయన లండన్‌ (London)లోని ప్రవాస భారతీయులతో ఇష్టాగోష్ఠీలో పాల్గొననున్నారు. దీంతో పాటు ఇండియన్‌ జర్నలిస్టు అసోసియేషన్‌ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. లండన్‌లోని పలు రంగాలకు చెందిన ప్రముఖులు, వ్యాపారవేత్తలతో ఆయన చర్చలు జరపనున్నట్లు కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడించాయి.

ఇక, కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయంలో రాహుల్‌ (Rahul Gandhi) ప్రసంగిస్తూ.. భారత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో చిక్కుకుందని, తనతో సహా పలువురు విపక్ష నేతల ఫోన్లపై నిఘా కొనసాగుతోందని ఆయన ఆరోపించారు. రాజ్యాంగ వ్యవస్థలపైనా దాడి జరుగుతోందని దుయ్యబట్టారు. అయితే ఈ ప్రసంగం భారత్‌లో తీవ్ర దుమారానికి దారితీసింది. రాహుల్‌  మళ్లీ విదేశీ గడ్డకు వెళ్లి.. స్వదేశంలోని ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారంటూ భాజపా నేతలు ధ్వజమెత్తారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు