Rahul Gandhi: అమెరికాలో పర్యటించనున్న రాహుల్‌

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) జూన్‌ 22నుంచి అమెరికాలో పర్యటించనున్నారు. అంతకుముందే కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) అమెరికా పర్యటనకు సిద్ధమైనట్లు సమాచారం.

Published : 16 May 2023 18:07 IST

దిల్లీ: కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) అమెరికా పర్యటనకు సిద్ధమయ్యారు. మే 31 నుంచి పది రోజులపాటు అక్కడ (America) పర్యటించనున్నట్లు సమాచారం. జూన్‌ 4న న్యూయార్క్‌లోని మాడిసన్‌ స్క్వేర్‌ గార్డెన్‌లో ఏర్పాటు చేసే బహిరంగ సభలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. వాషింగ్టన్‌, కాలిఫోర్నియాలోని పలు కార్యక్రమాల్లో పాల్గొనడంతోపాటు స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ విద్యార్థులతోనూ ముచ్చటించనున్నారు. వీటితోపాటు అనేక మంది రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలతోనూ రాహుల్‌ గాంధీ భేటీ అవుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే, ప్రధాని మోదీ (Narendra Modi) అమెరికా పర్యటనకు వెళ్లనున్న కొద్ది రోజుల ముందే.. రాహుల్‌ గాంధీ పర్యటనకు సిద్ధమవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

అధికారిక పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూన్‌ 22నుంచి అమెరికాలో పర్యటించనున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ దంపతులు మోదీకి ఆతిథ్యం ఇవ్వనున్నారు. మోదీ పర్యటన వివరాలను విదేశాంగశాఖ ఇటీవలే వెల్లడించింది. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలతోపాటు పలు అంతర్జాతీయ అంశాలపై మోదీ-బైడెన్‌లు చర్చలు జరుపుతారని తెలిపింది.

ఇదిలాఉంటే, కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఇటీవల చేసిన బ్రిటన్‌ పర్యటన వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఈ ఏడాది మార్చిలో కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీలో రాహుల్‌ చేసిన ప్రసంగంపై భాజపా నేతలు, మంత్రులు తీవ్ర విమర్శలు గుప్పించారు. భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందంటూ రాహుల్‌ చేసిన వ్యాఖ్యలు విదేశీగడ్డపై దేశ ప్రతిష్ఠను దిగజార్చేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు రాహుల్‌ గాంధీ క్షమాపణలు చెప్పేవరకూ పార్లమెంటులో మాట్లాడనిచ్చే ప్రసక్తే లేదని భాజపా స్పష్టం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని