Rahul Gandhi: కేంబ్రిడ్జిలో డిఫరెంట్‌ లుక్‌తో రాహుల్‌‌‌.. ఫొటోలు వైరల్‌

భారత్‌ జోడో యాత్ర నుంచి కొన్ని నెలలుగా గడ్డం పెంచిన రాహుల్‌ గాంధీ(Rahul Gandhi) ఇప్పుడు కొత్త లుక్‌తో ఆకట్టుకుంటున్నారు. లండన్‌ పర్యటనలో సూట్‌తో ఉన్న ఆయన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

Updated : 01 Mar 2023 17:56 IST

దిల్లీ: నాలుగు నెలలకు పైగా కొనసాగిన భారత్‌ జోడో యాత్ర(Bharat jodo yatra)లో గడ్డంతో ఉన్న రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఇప్పుడు కొత్త లుక్‌(Newk look)తో ఆకట్టుకుంటున్నారు. హెయిర్‌ కటింగ్‌, గడ్డం ట్రిమ్‌ చేయించుకొని తొలిసారి స్టైలీష్‌ లుక్‌లో ఉన్న ఆయన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. తాను విద్యనభ్యసించిన కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో ఓ కార్యక్రమంలో ప్రసంగించేందుకు వెళ్లిన రాహుల్‌ అక్కడ సూట్‌తో డిఫరెంట్‌ లుక్‌లో కనబడుతున్నారు. ఇటీవల మూడు రోజుల పాటు రాయ్‌పూర్‌లో జరిగిన కాంగ్రెస్‌ ప్లీనరీ ముగిసిన తర్వాత రాహుల్‌ నేరుగా యూకేకు బయల్దేరి వెళ్లిన రాహుల్.. వారం రోజుల పాటు లండన్‌లో పర్యటించనున్నారు.

52 ఏళ్ల రాహుల్ గాంధీ కేంబ్రిడ్జి వర్సిటీలో ‘‘లెర్నింగ్‌ టు లిజన్‌ ఇన్‌ ద ట్వంటీ ఫస్ట్‌ సెంచరీ’’ అనే అంశంపై ప్రసంగించేందుకు వెళ్లారు. రాహుల్‌ను ఆహ్వానిస్తూ కేంబ్రిడ్డ్ జేబీఎస్ ఈ మేరకు ట్వీట్ చేసింది. ‘‘మా కేంబ్రిడ్జి ఎంబీఏ ప్రోగ్రామ్‌ కాంగ్రెస్ ఎంపీ, విపక్ష నేత రాహుల్ గాంధీకి సాదరంగా స్వాగతిస్తోంది. ఆయన ఈరోజు విజిటింగ్ ఫెలో ఆఫ్ కేంబ్రిడ్జి జేబీఎస్‌గా ‘లెర్నింగ్ టు లిజన్ ఇన్ ద ట్వంటీ ఫస్ట్ సెంచరీ’’ అనే అంశంపై ప్రసంగిస్తారు’’ అని పేర్కొంటూ నిన్న ట్వీట్‌ చేసింది.  మరోవైపు, భారత సంతతికి చెందిన ఫెలో, యూనివర్సిటీకి చెందిన కార్పస్‌ క్రిస్టీ కళాశాల డైరెక్టర్‌, ట్యూటర్‌, గ్లోబల్ హ్యుమానిటీస్‌ ఇనిషియేటివ్‌ కో డైరెక్టర్‌ అయిన  శ్రుతి కపిలతో రాహుల్‌ గాంధీ బిగ్ డేటా అండ్ డెమోక్రసీ, భారత్‌- చైనా సంబంధాలు అనే అంశాలపై ప్రత్యేక సెషన్లలో పాల్గొననున్నారు. 

భాజపా పాలనకు వ్యతిరేకంగా దేశాన్ని ఏకం చేయాలనే నినాదంతో కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన భారత్‌ జోడో యాత్రను గతేడాది సెప్టెంబర్‌లో ప్రారంభించిన రాహుల్ జనవరి 30న ముగించిన విషయం తెలిసిందే. ఈ యాత్రలో భాగంగా రాహుల్‌ గాంధీ 12 రాష్ట్రాల మీదుగా దాదాపు 4వేల కి.మీలకు పైగా పాదయాత్ర చేశారు. అలాగే, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీలోనూ ఇటీవల ప్రసంగించిన విషయం తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని