Rahul Gandhi: ప్రభుత్వ ఒత్తిడితోనే నా ఫాలోవర్లను తగ్గిస్తున్నారు.. ట్విటర్‌ సీఈవోకు రాహుల్‌ లేఖ

ప్రముఖ సామాజిక మాధ్యమ సంస్థ ట్విటర్‌ (Twitter)పై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) ఫైర్‌ అయ్యారు. ప్రభుత్వం ఒత్తిడికి తలొగ్గి తన ట్విటర్‌లో

Updated : 27 Jan 2022 12:47 IST

తోసిపుచ్చిన సామాజిక మాధ్యమ సంస్థ

దిల్లీ: ప్రముఖ సామాజిక మాధ్యమ సంస్థ ట్విటర్‌ (Twitter)పై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) ఫైర్‌ అయ్యారు. ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గి ట్విటర్‌లో కావాలనే తన ఫాలోవర్లను తగ్గిస్తున్నారని మండిపడ్డారు. దేశంలో వాక్‌ స్వాతంత్ర్యాన్ని అడ్డుకోవడంలో ట్విటర్‌ తెలియకుండా భాగస్వామి అవుతోందని ఆక్షేపించారు. ఈ మేరకు ట్విటర్‌ సీఈవో పరాగ్‌ అగర్వాల్‌కు లేఖ రాశారు. అయితే, ఈ లేఖపై స్పందించిన సామాజిక మాధ్యమ సంస్థ.. రాహుల్‌ ఆరోపణలను తోసిపుచ్చింది. 

నిజానికి రాహుల్‌ గతేడాది డిసెంబరు 27నే ఈ లేఖ రాయగా.. తాజాగా అది వెలుగులోకి వచ్చింది. ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా, కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ల ట్విటర్‌ ఖాతాలను తన ఖాతాతో సరిపోల్చుతూ రాహుల్‌ లేఖలో పలు విమర్శలు చేశారు. 2021లో తొలి ఏడు నెలల్లో తనకు ఫాలోవర్లు పెరిగారని, ఆ తర్వాత ఆగస్టులో వారం పాటు తన ఖాతాను బ్లాక్‌ చేసినప్పటి నుంచి కావాలనే ఫాలోవర్ల సంఖ్యను తగ్గించారని ఆరోపించారు.

రాహుల్‌ లేఖ ఇలా..

‘‘డియర్‌ పరాగ్‌, ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం, అధికారం మధ్య సిద్ధాంతపరమైన యుద్ధానికి సామాజిక మాధ్యమాలే వేదికవుతున్నాయి. అందువల్ల ఈ వేదికలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. కానీ, భారత్‌లో వాక్‌ స్వాతంత్ర్యాన్ని అడ్డుకోవడంలో ట్విటర్‌ తెలియకుండానే భాగస్వామిగా మారుతోందన్న విషయాన్ని మీ (ట్విటర్‌ సీఈవోను ఉద్దేశిస్తూ) దృష్టికి తీసుకురావాలనుకుంటున్నా..! దేశ అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ నేతగా.. అన్యాయంపై ప్రజల తరఫున గళమెత్తాల్సిన బాధ్యత నాపై ఉంది. అయితే, భారత్‌లో మీడియా అణగదొక్కుతున్న నేపథ్యంలో ప్రజల సమస్యలను లేవనెత్తి.. ప్రభుత్వ బాధ్యతలను గుర్తుచేసేందుకు ట్విటర్‌ వంటి మాధ్యమాలు మాకు ప్రధాన వేదికలుగా మారాయి. అయితే గత కొన్ని రోజులుగా నా ట్విటర్‌ ఫాలోవర్ల సంఖ్య ఒక్కసారిగా పడిపోతూ వస్తోంది.

ట్విటర్‌లో నాకు దాదాపు 2 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. సగటున రోజుకు  8 నుంచి 10వేల మంది కొత్త ఫాలోవర్లు వస్తుంటారు. 2021 మే నెలలో దాదాపు 6.4లక్షల మంది కొత్తగా నన్ను అనుసరించడం మొదలుపెట్టారు. గతేడాది జులై వరకు ఇది ఇలాగే కొనసాగింది. ఆగస్టు 2021లో ఒక్కసారిగా ఇందులో మార్పులు చోటుచేసుకున్నాయి. నా ఖాతాకు సగటు నెలవారీ కొత్త ఫాలోవర్ల సంఖ్య దాదాపు సున్నాకు తగ్గింది. గతేడాది ఆగస్టులో వారం రోజుల పాటు నా ఖాతాను ట్విటర్‌ బ్లాక్‌ చేసింది. ఆ తర్వాత నుంచి కొత్త ఫాలోవర్ల సంఖ్య తగ్గుతూ వస్తోంది. అయితే, యాదృచ్ఛికంగా అదే సమయంలో దిల్లీలో అత్యాచార ఘటన, సాగు చట్టాలతో పాటు అనేక అంశాలపై నేన ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ వచ్చాను. 

నా గళాన్ని అణిచివేసేందుకు ప్రభుత్వం నుంచి ట్విటర్‌ ఇండియా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోందని నాకు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఎలాంటి చట్టబద్ధమైన కారణం లేకుండానే నా ఖాతాను కొన్ని రోజుల పాటు నిలిపివేశారు. నేను ట్వీట్‌ చేసిన ఫొటోలను ప్రభుత్వానికి చెందిన కొన్ని ఖాతాలతో పాటు మరికొందరు కూడా ట్వీట్‌ చేశారు. అయినా, వాటిని మాత్రం బ్లాక్‌ చేయకుండా నన్ను టార్గెట్ చేశారు. అందువల్ల కోట్లాది మంది భారతీయుల తరఫున నేను చెబుతున్నది ఒక్కటే..! దేశాన్ని విధ్వంసం చేయాలనుకునేవారి చేతుల్లో ట్విటర్‌ పావులా మారకూడదు. దీనిపై తగిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నా’’ అని రాహుల్‌ తన లేఖలో పేర్కొన్నారు.

నకిలీలను సహించబోం: ట్విటర్‌

ఈ లేఖపై ట్విటర్‌ అధికార ప్రతినిధి స్పందిస్తూ.. రాహుల్‌ ఆరోపణలను తోసిపుచ్చారు. ‘‘ట్విటర్‌లో ఫాలోవర్ల సంఖ్య అందరికీ కన్పించేదే. అది అర్థవంతమైన, కచ్చితమైన సంఖ్య అనే విశ్వాసాన్ని ప్రతి ఒక్కరికీ కలిగించాలనేదే మా ఉద్దేశం. తప్పుదోవ పట్టించడం, తప్పుడు సమాచారాన్ని మా వేదిక ఎన్నటికీ అంగీకరించబోదు. అలాంటి వాటి పట్ల మెషిన్‌ లెర్నింగ్‌ టెక్నాలజీ సాయంతో చర్యలు తీసుకుంటున్నాం. ఇందులో భాగంగానే కొందరి ఫాలోవర్ల సంఖ్యలో మార్పులు జరగొచ్చు. మా విధానాలను ఉల్లంఘించినందుకు గానూ ప్రతి వారం లక్షలాది మంది ఖాతాలను తొలగిస్తుంటాం’’ అని ట్విటర్‌ వివరణ ఇచ్చింది. 

గతేడాది ఆగస్టులో దిల్లీలో హత్యాచారానికి గురైన బాలిక తల్లిదండ్రులను రాహుల్‌ గాంధీ పరామర్శించారు. ఆ సమయంలో వారితో దిగిన ఫొటోలను ఆయన ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. దీంతో నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించినందుకు గానూ.. ఆయన ట్విటర్‌ను వారం పాటు నిలిపివేసిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని