Rahul gandhi: రాహుల్‌ వ్యవహారంపై అమెరికా కామెంట్‌.. అనురాగ్ ఠాకూర్‌ రియాక్షన్‌ ఇదే..!

Rahul Gandhi: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు విషయంలో అమెరికా ప్రతినిధి చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ స్పందించారు. ఇది భారత దేశ పార్లమెంట్‌ అంతర్గత వ్యవహారమన్నారు.

Published : 29 Mar 2023 00:40 IST

దిల్లీ: కాంగ్రెస్‌ (Congress) అగ్రనేత రాహుల్‌ గాంధీ(Rahul Gandhi)పై అనర్హత (Disqualification) వేటు అంశం భారత పార్లమెంట్‌ అంతర్గత వ్యవహారమని కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌(Anurag thakur) అన్నారు. రాహుల్‌పై అనర్హత వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం తీరుపై విపక్షాలు భగ్గుమంటుండటంతో దేశ రాజకీయాల్లో తీవ్ర దుమారం కొనసాగుతున్న విషయం తెలిసిందే.  దీనిపై తాజాగా  అగ్రరాజ్యం అమెరికా (America) సైతం స్పందించింది.  రాహుల్‌ గాంధీ కేసును వాషింగ్టన్‌ గమనిస్తోందని.. ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేసే అంశంలో భారత్‌తో కలిసి పనిచేసేందుకు కట్టుబడి ఉన్నట్టు అమెరికా విదేశాంగ శాఖ డిప్యూటీ అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్‌ వ్యాఖ్యానించారు. అయితే, ఆయన చేసిన వ్యాఖ్యలపై అనురాగ్‌ ఠాకూర్‌ స్పందించారు. ‘టైమ్స్‌ నెట్‌వర్క్‌ ఇండియా డిజిటల్‌ ఫెస్ట్‌’ లో పాల్గొన్న అనురాగ్‌ ఠాకూర్‌ ఈ అంశంపై మాట్లాడుతూ..  ‘‘ఇది మా అంతర్గత వ్యవహారం. సుప్రీంకోర్టుకు ఎవరూ అతీతులు కాదు. ఇక్కడ జ్యుడీషియల్‌, రాజ్యాంగబద్ధ వ్యవస్థలు ఉన్నాయి. అమెరికా ఓ జనరల్‌ స్టేట్‌మెంట్‌ చేసింది’’ అన్నారు. 

2019 నాటి క్రిమినల్‌ పరువు నష్టం కేసులో  రాహుల్‌ గాంధీని దోషిగా తేల్చిన గుజరాత్‌లోని సూరత్‌కోర్టు.. ఆయనకు రెండేళ్ల పాటు జైలు శిక్షవిధించిన విషయం తెలిసిందే. దీంతో ఆ మరుసటిరోజే లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ లోక్‌సభ సెక్రటేరియట్‌ ప్రకటన జారీ చేయడంతో కాంగ్రెస్‌తో పాటు పలు విపక్షాలు భగ్గుమంటున్నాయి. కేంద్రం తీరును నిరసిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ శ్రేణులు ఆందోళనలు కొనసాగిస్తున్నాయి.  ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి వేదాంత్‌ పటేల్‌ స్పందిస్తూ..  ‘‘ఏ ప్రజాస్వామ్యానికైనా (Democracy).. చట్ట నిబంధనలను గౌరవించడం, న్యాయ స్వతంత్రత మూల స్తంభాలు. భారత కోర్టుల్లో రాహుల్‌ గాంధీ కేసును మేం గమనిస్తున్నాం. భావ ప్రకటనా స్వేచ్ఛతో పాటు ప్రజాస్వామ్య విలువలపై భారత ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు నిబద్ధతతో ఉన్నాం. మా రెండు దేశాలకు కీలక అంశాలైన ప్రజాస్వామ్య సూత్రాలు, మానవ హక్కుల పరిరక్షణ, భావ ప్రకటనా స్వేచ్ఛ ప్రాముఖ్యతను నిత్యం హైలైట్‌ చేస్తూనే ఉంటాం’’ అంటూ చేసిన వ్యాఖ్యలపై అనురాగ్ ఠాకూర్‌ పైవిధంగా స్పందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని