Rahul Gandhi: పాస్‌పోర్టు కోసం.. కోర్టుకెళ్లిన రాహుల్‌ గాంధీ

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) కొత్త పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందుకు ఎన్‌వోసీ ఇవ్వాలంటూ కోర్టులో పిటిషన్‌ వేశారు. మరి ఆయనకు ఇప్పటివరకు ఉన్న పాస్‌పోర్టు ఏమైందంటే..?

Published : 24 May 2023 12:20 IST

దిల్లీ: మరికొద్ది రోజుల్లో అమెరికా పర్యటనకు సిద్ధమవుతున్న కాంగ్రెస్‌ (Congress) అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi).. కొత్త పాస్‌పోర్టు (Passport) కోసం కోర్టును ఆశ్రయించారు. ‘సాధారణ పాస్‌పోర్టు’ను పొందేందుకు నిరభ్యంతర పత్రాన్ని ఇవ్వాలంటూ బుధవారం దిల్లీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై మే 26 (శుక్రవారం)న విచారణ జరపనున్నట్లు న్యాయస్థానం తెలిపింది.

‘మోదీ ఇంటిపేరు’ వ్యాఖ్యల కేసులో రెండేళ్ల జైలు శిక్ష పడటంతో రాహుల్‌ (Rahul Gandhi)పై అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే. దీంతో ఆయన లోక్‌సభ సభ్యత్వం రద్దయ్యింది. ఫలితంగా రాహుల్‌ తన దౌత్య పాస్‌పోర్టు (Diplomatic Passport) సహా అన్ని రకాల ప్రయాణ పత్రాలను సంబంధిత అధికారులు సమర్పించారు. దీంతో ఇప్పుడు కొత్తగా సాధారణ పాస్‌పోస్టు కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే, నేషనల్‌ హెరాల్డ్ కేసులో రాహుల్ నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. దీంతో పాస్‌పోర్టు జారీ కోసం నో అబ్జెక్షన్‌ సర్టిఫికేట్‌ (NOC) ఇవ్వాలని దిల్లీ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను స్వీకరించిన న్యాయస్థానం.. శుక్రవారం విచారణ చేపడతామని తెలిపింది.

నేషనల్‌ హెరాల్డ్ కేసు (National Herald case)లో రాహుల్‌ గాంధీతో పాటు మరికొందరికి 2015 డిసెంబరు 19న దిల్లీ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. కాగా.. రాహుల్‌ గాంధీ ఈ నెల 31 నుంచి పది రోజులపాటు అమెరికాలో పర్యటించనున్నట్లు కాంగ్రెస్‌ వర్గాలు ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. జూన్‌ 4న న్యూయార్క్‌లోని మాడిసన్‌ స్క్వేర్‌ గార్డెన్‌లో ఏర్పాటు చేసే బహిరంగ సభతో పాటు వాషింగ్టన్‌, కాలిఫోర్నియాలోని పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు