Rahul Gandhi: గోవా వీధుల్లో రాహుల్‌ బైక్‌ రైడ్‌.. 

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ శనివారం గోవాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన.. గోవా వీధుల్లో కొంతసేపు బైక్‌పై

Published : 31 Oct 2021 01:42 IST

పనాజీ: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ శనివారం గోవాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన.. గోవా వీధుల్లో కొంతసేపు బైక్‌పై తిరిగారు. రోడ్డు పక్కన ఉన్న దాబాలో భోజనం చేశారు. 

ఈ ఉదయం దక్షిణ గోవా చేరుకున్న రాహుల్‌.. అక్కడి బాంబూలిమ్‌ గ్రామంలో మత్స్యకారులను కలిసి వారితో మాట్లాడారు. అక్కడి నుంచి తిరుగు ప్రయాణమైన ఆయన మధ్యలో ఆగి రోడ్డు పక్కన దాబాలో భోజనం చేశారు. ఆయన వెంట పలువురు కాంగ్రెస్‌ నేతలు ఉన్నారు. ఆ తర్వాత గోవాలో ‘పైలట్‌’గా పిలిచే టూవీలర్‌ ట్యాక్సీ బండిపై లిఫ్ట్‌ అడిగి ఆజాద్‌ మైదాన్‌ వరకు వెళ్లారు. ‘పైలట్‌’ డ్రైవర్‌ బైక్‌ నడుపుతుండగా రాహుల్‌ వెనక కూర్చుని దాదాపు 5 కిలోమీటర్లు బండిపై ప్రయాణించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను కాంగ్రెస్‌ తమ అధికారిక ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది. 

కాంగ్రెస్‌ మేనిఫెస్టో.. ఓ గ్యారెంటీ

కాంగ్రెస్‌ ఎన్నికల మేనిఫెస్టో అంటే కేవలం వాగ్దానాలు మాత్రమే కాదని, విశ్వాసంతో కూడిన ఓ గ్యారెంటీ అని రాహుల్‌ మత్స్యకారులతో అన్నారు. ‘‘నాకు విశ్వసనీయతే ముఖ్యం.. ఇతర రాజకీయ నేతల్లా కాదు. నేను ఏదైనా చెప్పానంటే అది తప్పకుండా జరుగుతుంది. ఛత్తీస్‌గఢ్‌లో రైతు రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చాం. అధికారంలోకి వచ్చాక దాన్ని నెరవేర్చాం. పంజాబ్‌, కర్ణాటకల్లోనూ అలాగే చేశాం. మా మేనిఫెస్టో అంటే ఓ గ్యారెంటీ లాంటిది’’ అని రాహుల్‌ చెప్పుకొచ్చారు. గోవాలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని