Rahul Gandhi: 3 గంటల పాటు రాహుల్‌ను విచారించిన ఈడీ.. బ్రేక్‌ తర్వాత మరోసారి

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సోమవారం ఈడీ విచారణను ఎదుర్కొన్నారు. నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో దర్యాప్తు సంస్థ ఆయన్ను మూడు గంటల పాటు ప్రశ్నించింది.

Updated : 13 Jun 2022 17:06 IST

దిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సోమవారం ఈడీ విచారణను ఎదుర్కొన్నారు. నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో దర్యాప్తు సంస్థ ఆయన్ను మూడు గంటల పాటు ప్రశ్నించింది. అనంతరం సోదరి ప్రియాంక గాంధీతో కలిసి, కార్యాలయం వద్ద నుంచి వెళ్లిపోయారు. తర్వాత పార్టీ అధినేత్రి సోనియా గాంధీ చికిత్స పొందుతోన్న సర్ గంగరామ్ ఆసుపత్రికి చేరుకున్నారు. సోనియా ఇటీవల కొవిడ్ బారినపడిన సంగతి తెలిసిందే. కరోనా తదనంతర సమస్యలతో ఆమె ఆసుపత్రిలో చేరారు. ఆ వెంటనే మరో దఫా  విచారణ నిమిత్తం తిరిగి ఈడీ కార్యాలయానికి వెళ్లారు.  

ఈ రోజు రాహుల్ ఈడీ విచారణకు వెళ్తోన్న సమయంలో కాంగ్రెస్‌ నేతలు దేశవ్యాప్త నిరసనలకు దిగారు. నేతల నుంచి లభించిన మద్దతు మధ్య రాహుల్ ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ క్రమంలో ప్రియాంక గాంధీ రాహుల్ పక్కనే ఉండి చూసుకున్నారు. ఎంటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుండా నిరసనకారుల్ని పోలీసులు ఎక్కడిక్కడే నిలువరించారు. రణ్‌దీప్‌ సూర్జేవాలా, హరీశ్‌ రావత్‌ వంటి సీనియర్‌ నేతలను అదుపులోకి తీసుకున్నారు. మరోపక్క, సోనియా ఇదే కేసులో ఈ నెల 23న ఈడీ ముందు హాజరురావాల్సి ఉంది.


కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్ గాంధీపై కేంద్రం తీసుకుంటున్న చర్యలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ నిరసనలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్‌ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. దిల్లీలో నిరసన వ్యక్తం చేస్తున్న పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌, హరీశ్‌ రావత్‌ సహా పలువురు నేతలను తుగ్లక్‌ రోడ్డు పోలీసుస్టేషన్‌కు తరలించగా.. వారిని కలిసేందుకు ఆ పార్టీ జనరల్‌ సెక్రటరీ ప్రియాంకా గాంధీ వాద్రా స్టేషన్‌కు వెళ్లారు. ఆమె రాకతో పోలీసుస్టేషన్‌ వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడినప్పటికీ.. చివరకు ప్రియాంకాను లోపలికి అనుమతించారు. వేణుగోపాల్‌ సహా నేతలను కలిసిన ప్రియాంక వారితోపాటు కొద్దిసేపు స్టేషన్‌లోనే కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు అరెస్టు చేసినవారిలో రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లోత్‌ కూడా ఉన్నారు. ఆయన్ను మరో పోలీసస్టేషన్‌కు తరలించారు. తనతోపాటు పార్టీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకొని బస్సుల్లో తరలిస్తున్న ఫొటోలు, వీడియోలను గెహ్లోత్‌ తన ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. పోలీసుల వైఖరి దారుణంగా ఉందని ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రధాన నేతలు మల్లికార్జున్‌ ఖర్గే, జైరామ్‌ రమేశ్‌, దిగ్విజయ్‌ సింగ్‌, ముకుల్‌ వాస్నిక్‌, దీపేందర్‌ హుడా పలురువు నేతలను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని