Bharat Jodo Yatra: మమ్మల్ని ఎవరూ ఆపలేరు..! జోరు వర్షంలోనూ రాహుల్‌ ప్రసంగం

కాంగ్రెస్‌(Congress) పార్టీ ప్రతిష్ఠాత్మకంగా చేపడుతోన్న ‘భారత్‌ జోడో యాత్ర’ ప్రస్తుతం కర్ణాటక(Karnataka)లో కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పార్టీ అగ్ర నేత రాహుల్‌ గాంధీ...

Published : 03 Oct 2022 01:24 IST

బెంగళూరు: కాంగ్రెస్‌(Congress) పార్టీ ప్రతిష్ఠాత్మకంగా చేపడుతోన్న ‘భారత్‌ జోడో యాత్ర(Bharat Jodo Yatra)’ ప్రస్తుతం కర్ణాటక(Karnataka)లో కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పార్టీ అగ్ర నేత రాహుల్‌ గాంధీ(Rahul Gandhi) ఆదివారం మైసూరులో పాదయాత్ర కొనసాగించారు. భారీగా తరలివచ్చిన జనసందోహం మధ్య ముందుకు నడక  సాగించారు. యాత్రలో భాగంగా సాయంత్రం నిర్వహించిన ఓ బహిరంగ సభలో రాహుల్‌ మాట్లాడారు. ఈ సందర్భంగా జోరు వానను లెక్కచేయకుండా తన ప్రసంగాన్ని కొనసాగించడం గమనార్హం. వర్షంలోనే పార్టీలో చేరికల ప్రక్రియ, నేతలంతా కలిసి అభివాదం చేయడం వంటివి చేశారు. దీనికి సంబంధించిన వీడియోను రాహుల్‌ గాంధీ ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు.

‘భారత్‌ను ఏకం చేయడంలో మమ్మల్ని ఎవరూ ఆపలేరు. దేశ గొంతుకను వినిపించే విషయంలో ఎవరూ ఆపలేరు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు సాగే ‘భారత్‌ జోడో యాత్ర’నూ ఎవరూ ఆపలేరు’ అని క్యాప్షన్‌ పెట్టారు. అంతకుముందు ఖాదీ గ్రామోదయ కేంద్రంలో మహాత్మా గాంధీకి ఆయన నివాళులు అర్పించారు. గాంధీ సిద్ధాంతాలను వల్లించడం కేంద్రంలో అధికారంలో ఉన్నవారికి సులభంగానే ఉంటుంది కానీ, ఆయన అడుగు జాడల్లో నడవడం మాత్రం వాళ్లకు కష్టమని విమర్శించారు. ఇదిలా ఉండగా.. సెప్టెంబర్‌ 7న మొదలైన భారత్‌ జోడో యాత్ర ఆదివారం 25వ రోజుకు చేరుకుంది. కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు ఇది కొనసాగనుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని