Lakhimpur Kheri: రైతన్నల ‘రైల్‌రోకో’.. 160 రైళ్లకు అంతరాయం

ఉత్తరప్రదేశ్‌లోని లఖింపుర్‌ ఖేరిలో చోటుచేసుకున్న హింసాకాండపై ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్‌ మిశ్రాను పదవి నుంచి తొలగించాలని

Updated : 18 Oct 2021 16:33 IST

దిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని లఖింపుర్‌ ఖేరిలో చోటుచేసుకున్న హింసాకాండపై ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్‌ మిశ్రాను పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేస్తూ సంయుక్త కిసాన్‌ మోర్చా ఆధ్వర్యంలో నేడు రైతులు ‘రైల్‌రోకో’ చేపట్టారు. అన్నదాతలు పట్టాలపైకి చేరి నిరసనలు తెలియజేశారు. దీంతో దేశవ్యాప్తంగా పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 

లఖింపుర్‌ హింసకు నిరసనగా సోమవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రైల్‌రోకో ఆందోళనలు చేపట్టాలని సంయుక్త కిసాన్‌ మోర్చా పిలుపునిచ్చింది. దీంతో ఉత్తరప్రదేశ్‌ సహా పంజాబ్‌, హరియాణా, రాజస్థాన్‌ తదితర రాష్ట్రాల్లో రైతు సంఘాలు రైల్‌రోకోకు దిగాయి. పట్టాలపై కూర్చుని అన్నదాతలు కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అజయ్‌మిశ్రాను పదవి నుంచి తప్పించాలని డిమాండ్‌ చేశారు. దీంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. రైల్‌రోకో కారణంగా 160 రైళ్లకు అంతరాయం ఏర్పడినట్లు రైల్వే అధికారులు తెలిపారు. 

ఉత్తర రైల్వే జోన్‌ పరిధిలో దాదాపు 150 ప్రాంతాల్లో రైతులు రైల్వే ట్రాక్‌లపై ఆందోళన చేపట్టారు. దీంతో పలు రైళ్లను రద్దయ్యాయి. కొన్ని రైళ్లను దారిమళ్లించాల్సి వచ్చింది. మరికొన్నింటిని మధ్యలోనే నిలిపివేయడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. 

ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపుర్ ఖేరిలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులపై కేంద్రమంత్రి తనయుడు ఆశిష్‌ మిశ్రా వాహన శ్రేణి దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ జరిగిన ఘటనల్లో నలుగురు రైతులతో సహా ఎనిమిది మరణించారు. దాంతో కేంద్ర మంత్రి దిగిపోవాలని, ఆయన తనయుడికి శిక్ష పడాలని దేశవ్యాప్తంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆశిష్‌ పోలీసుల అదుపులో ఉన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని