Odisha Train Accident: ఒడిశా రైలు దుర్ఘటన.. సీబీఐ విచారణకు రైల్వేబోర్డు సిఫారసు

ఒడిశాలో రైలు దుర్ఘటనపై దర్యాప్తుకు సీబీఐతో విచారణకు రైల్వే బోర్డు సిఫారసు చేసింది. ఈ విషయాన్ని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ప్రకటించారు.

Updated : 04 Jun 2023 21:07 IST

భువనేశ్వర్‌: ఒడిశాలోని బాలేశ్వర్‌ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాద(Odisha train accident) ఘటనపై దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని రైల్వే బోర్డు నిర్ణయించినట్టు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు. ఈ దుర్ఘటనపై సీబీఐతో దర్యాప్తు చేయాలని రైల్వే బోర్డు సిఫారసు చేసిందని తెలిపారు. ఆదివారం సాయంత్రం ఆయన భువనేశ్వర్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. సహాయక కార్యక్రమాలు పూర్తయ్యాయని.. ఘటనా స్థలిలో పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని చెప్పారు. రైల్వే ట్రాక్‌కు సంబంధించిన పనులు పూర్తయ్యాయన్న మంత్రి.. ఓవర్‌ హెడ్‌ వైరింగ్‌ పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. బాధితులకు ఆస్పత్రుల్లో చికిత్స కొనసాగుతోందన్నారు. 

బాలేశ్వర్‌, కటక్‌, భువనేశ్వర్‌లలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా మద్దతుగా నిలుస్తోందని మంత్రి చెప్పారు. ఆయా ఆస్పత్రుల్లో వారికి అన్ని వసతులూ కల్పించినట్టు తెలిపారు. వారి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం వైద్య బృందాలు పర్యవేక్షిస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. ఈ దుర్ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలను సంప్రదించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు. శుక్రవారం రాత్రి మూడు రైళ్లు ఢీకొట్టిన ఘటనలో 275మంది మృతిచెందగా.. 1100 మందికి పైగా గాయపడిన ఘటన పెను విషాదం నింపిన విషయం తెలిసిందే.

రైలు ప్రమాదానికి (Odisha Train Accident) పూర్తి కారణాలపై ఇంకా స్పష్టత రానప్పటికీ.. డ్రైవర్‌ తప్పిదం లేకపోవచ్చని రైల్వేశాఖ ఉన్నతాధికారులు (Indian Railways) అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటన సమయంలో రెండు రైళ్లూ పరిమిత వేగానికి లోబడే వెళ్తున్నట్టు చెబుతున్నారు. ఎలక్ట్రానిక్‌ ఇంటర్‌లాకింగ్‌ వ్యవస్థ (Interlocking System) సరిగ్గానే ఉన్నప్పటికీ.. అందులో ఎవరో ట్యాంపరింగ్‌కు పాల్పడ్డారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్న అధికారులు.. విధ్వంసం కోణంలోనూ దర్యాప్తును ముమ్మరం చేశారు. మరోవైపు, కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగానే ఈ దుర్ఘటన జరిగిందని ప్రతిపక్షాలు మండిపడుతున్న విషయం తెలిసిందే. రైల్వేకు సంబంధించిన భద్రతా వ్యవస్థపై ప్రశ్నలు సంధిస్తున్నాయి. ఈ ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ రైల్వే మంత్రి రాజీనామా చేయాలంటూ డిమాండ్‌ చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ కేసును ప్రభుత్వ రైల్వే పోలీసులు (GRP) దర్యాప్తు చేస్తున్నారు.

సిగ్నలింగ్‌లో సమస్య కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా తేలినట్టు రైల్వే బోర్డు సభ్యురాలు జయవర్మ సిన్హా ఆదివారం వెల్లడించారు.  రైల్వే సేఫ్టీ కమిషనర్‌ నుంచి పూర్తి స్థాయి నివేదిక రావాల్సి ఉందన్నారు. ఈ ఘటనలో కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ మాత్రమే ప్రమాదానికి గురైనట్టు, ఆ సమయంలో దాని వేగం దాదాపు గంటకు 128 కి.మీలుగా ఉన్నట్టు ఆమె వెల్లడించారు. గూడ్స్‌ రైలులో ఇనుప ఖనిజం ఉండటం వల్లే ప్రమాద తీవ్రత పెరిగిందని అభిప్రాయపడుతున్నట్టు చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని