Train Collision: ఘోర రైలు ప్రమాదం.. మృతులకు రైల్వేశాఖ ఎక్స్‌గ్రేషియా ప్రకటన

రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో మృతులకు రైల్వే శాఖ ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఈ మొత్తాన్ని వారి కుటుంబసభ్యులకు అందించనుంది.

Updated : 17 Jun 2024 19:57 IST

దిల్లీ: పశ్చిమబెంగాల్‌లోని దార్జిలింగ్‌ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతిచెందిన వారికి రైల్వే శాఖ మంత్రి అశ్వినీవైష్ణవ్‌ ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఈ దుర్ఘటనలో మృతిచెందిన కుటుంబసభ్యులకు  రూ.10లక్షల చొప్పున పరిహారం చెల్లించనున్నట్లు వెల్లడించారు. ఈమేరకు ఆయన ‘ఎక్స్‌’లో పోస్ట్‌ పెట్టారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడినవారికి రూ.2.5 లక్షలు, స్వల్పగాయాలైన వారికి రూ.50వేలు చొప్పున ఇస్తామని తెలిపారు. సోమవారం ఉదయం దార్జిలింగ్ జిల్లాలో సీల్దా నుంచి వెళ్తున్న కాంచన్‌జంఘా ఎక్స్‌ప్రెస్‌ను ఓ గూడ్స్‌ రైలు ఢీకొన్న దుర్ఘటనలో 9 మంది ప్రయాణికులు దుర్మరణం పాలవగా.. 40మందికి పైగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. 

ఘోర ప్రమాదం: రెండు రైళ్లు ఢీ.. గాల్లోకి లేచిన బోగీ

ఈ ఘటన చాలా దురదృష్టకరమని, సహాయక చర్యలు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నట్లు రైల్వేమంత్రి వైష్ణవ్‌ తొలుత పేర్కొన్నారు. రైల్వే, ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు పరస్పర సహకారంతో పని చేస్తున్నాయని తెలిపారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలిస్తున్నామన్నారు. ఘటనా స్థలికి సీనియర్‌ ఉన్నతాధికారులు చేరుకున్నారని పేర్కొన్నారు. మరోవైపు, ఈ ఘటనపై రైల్వేశాఖ సహాయమంత్రి రవ్‌నీత్‌ సింగ్‌ బిట్టూ స్పందించారు.  ఈ విషాద ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని