GST Council Meeting: ‘జీఎస్టీలోకి పెట్రో’పై రాష్ట్రాలదే నిర్ణయం

రైల్వే ప్లాట్‌ఫాం టికెట్లతోపాటు విద్యా సంస్థల బయట ఉండే ప్రైవేటు హాస్టళ్లను జీఎస్టీ నుంచి మినహాయిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వీటితోపాటు అన్ని పాల క్యాన్లపై జీఎస్టీని 12శాతంగా, కార్టన్‌ బాక్సులపై 18 శాతం నుంచి 12శాతానికి పన్నును తగ్గిస్తున్నట్లు పేర్కొంది.

Published : 23 Jun 2024 05:01 IST

ప్లాట్‌ఫాం టికెట్లకు జీఎస్టీ మినహాయింపు
రైల్వేలో మరికొన్ని సేవలకు, ప్రైవేటు హాస్టళ్లకూ..
ఎరువుల అంశం పార్లమెంటరీ కమిటీకి..
జీఎస్టీ మండలి నిర్ణయాలు

జీఎస్టీ మండలి సమావేశ వివరాలు వెల్లడిస్తున్న నిర్మలాసీతారామన్‌

దిల్లీ: రైల్వే ప్లాట్‌ఫాం టికెట్లతోపాటు విద్యా సంస్థల బయట ఉండే ప్రైవేటు హాస్టళ్లను జీఎస్టీ నుంచి మినహాయిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వీటితోపాటు అన్ని పాల క్యాన్లపై జీఎస్టీని 12శాతంగా, కార్టన్‌ బాక్సులపై 18 శాతం నుంచి 12శాతానికి పన్నును తగ్గిస్తున్నట్లు పేర్కొంది. పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోని తీసుకొచ్చే విషయంలో రాష్ట్రాలదే కీలక పాత్రని, అవి రేటును నిర్ణయించాక అమల్లోకి తెస్తామని స్పష్టం చేసింది. ఎరువులపై జీఎస్టీ మినహాయింపు అంశాన్ని పార్లమెంటరీ కమిటీకి అప్పగిస్తున్నట్లు వెల్లడించింది. దిల్లీలో శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన జరిగిన 53వ జీఎస్టీ పాలక మండలి సమావేశం ఈ నిర్ణయాలను తీసుకుంది. ఇందులో మండలి సభ్యులతోపాటు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు పాల్గొన్నారు. సమావేశానంతరం మంత్రి సీతారామన్‌ మీడియాతో వివరాలను వెల్లడించారు.

  • రైల్వేల్లో ప్లాట్‌ఫాం టికెట్లు, విశ్రాంతి గదులు, వెయిటింగ్‌ హాళ్లు, సామానులు భద్రపరిచే గదులు, బ్యాటరీ వాహనాలు, రైల్వేశాఖలో అంతర్గత లావాదేవీలపై జీఎస్టీ మినహాయింపునకు ఆమోదం తెలిపింది. రైల్వేల్లో ప్రత్యేక వాహక సంస్థలకు పన్ను మినహాయింపు వర్తిస్తుంది.
  • నెలకు రూ.20,000 కంటే తక్కువ ఛార్జీలు వసూలు చేసే అన్ని ప్రైవేటు హాస్టళ్లకు జీఎస్టీ మినహాయింపు వర్తిస్తుంది. గతంలో విద్యా సంస్థలకు అనుబంధంగా హాస్టళ్లకే మినహాయింపు ఉండేది. 
  • మిల్క్‌ క్యాన్లపై (స్టీలు, ఇనుము, అల్యూమినియం) జీఎస్టీని 12శాతానికి మండలి పరిమితం చేసింది. కార్టన్‌ బాక్సులపై 18 శాతం నుంచి 12శాతానికి పన్ను తగ్గింది. సోలార్‌ కుక్కర్లు, స్ప్రింక్లర్లపై జీఎస్టీ ఇకపై 12 శాతమే.
  • విమానాల విడి భాగాలు, టెస్టింగ్‌ సామగ్రి దిగుమతిపై 5శాతం జీఎస్టీ వర్తిస్తుంది.
  • కోళ్ల ఫారాల యంత్రాలపై 12శాతం జీఎస్టీ ఉంటుంది. 
  • రక్షణ, పరిశోధనలకు సంబంధించిన వాటి దిగుమతులపై 2029 వరకూ జీఎస్టీ మినహాయింపు ఉంటుంది. 

వెసులుబాట్లు

  • వ్యాపారులకు ఇచ్చే పన్ను డిమాండు నోటీసుల సందర్భంగా విధించే పెనాల్టీలపై వడ్డీ మినహాయింపు. 
  • జీఎస్టీ పన్నులపై వివాదాల్లో కోర్టులకు వెళ్లేందుకు పరిమితులను విధించారు. రూ.20లక్షల వరకూ కేసులకు జీఎస్టీ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌కు, రూ.1 కోటి వరకూ హైకోర్టులకు, రూ.2 కోట్ల వరకూ సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది. 

పెట్రో ఉత్పత్తులపై..

జీఎస్టీ పరిధిలోని పెట్రో ఉత్పత్తులను తీసుకొచ్చే విషయంలో కేంద్రం సానుకూలంగానే ఉందని, పన్ను రేటుపై రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవాల్సి ఉందని నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ఈ విషయంలో రాష్ట్రాలన్నీ ఏకతాటిపైకి రావాలని సూచించారు. అరుణ్‌ జైట్లీ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పటి నుంచే తాము అనుకూలంగా ఉన్నామని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని