Railways: వయోవృద్ధుల రాయితీ నిలిపివేత.. రైల్వేకు రూ.1500కోట్ల అదనపు ఆదాయం

గడిచిన రెండేళ్లలో వయోవృద్ధులకు నిలిపివేసిన రాయితీ కారణంగా రైల్వే దాదాపు రూ.1500 కోట్ల అదనపు ఆదాయాన్ని పొందినట్లు తేలింది.

Published : 17 May 2022 01:53 IST

ఆర్టీఐ దరఖాస్తులో వెల్లడి

దిల్లీ: కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో వయోవృద్ధులు సహా ప్రయాణికులకు ఇచ్చే పలు రాయితీలను భారతీయ రైల్వే నిలిపివేసింది. వారి నుంచి పూర్తిస్థాయి ఛార్జీలను వసూలు చేసింది. ఇలా గడిచిన రెండేళ్లలో వయోవృద్ధులకు నిలిపివేసిన రాయితీ కారణంగా రైల్వే దాదాపు రూ.1500 కోట్ల అదనపు ఆదాయాన్ని పొందినట్లు తేలింది. సమాచార హక్కు చట్టం కింద మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నలకు రైల్వేశాఖ ఈ వివరాలు వెల్లడించింది.

మార్చి 20, 2020 నుంచి మార్చి 31, 2022 మధ్యకాలంలో సీనియర్‌ సిటిజన్లకు అందించే రాయితీని భారతీయ రైల్వే నిలిపివేసింది. తద్వారా 7.31 కోట్ల మంది సీనియర్‌ సిటిజన్‌ ప్రయాణికులు ఈ ప్రయోజనాన్ని పొందలేకపోయారు. ఇదే సమయంలో సీనియర్‌ సిటిజన్ల ప్రయాణికుల నుంచి రూ.3464 కోట్ల ఆదాయం రైల్వేకు వచ్చింది. వారికి రాయితీ ఇవ్వనందున భారతీయ రైల్వేకు రూ.1500 అదనపు ఆదాయం సమకూరినట్లయ్యింది. రెండేళ్లలో రైళ్లలో ప్రయాణించిన ఏడున్నర కోట్ల వృద్ధుల్లో 4.46 కోట్ల మంది 60ఏళ్ల వయసుపైబడిన పురుషులు, మరో 2.84 కోట్ల మంది 58ఏళ్ల వయసుపైబడిన మహిళలు ఉన్నారు. వీరితోపాటు మరో 8310 మంది ట్రాన్స్‌జండర్లు కూడా ఈ ప్రయోజనం పొందలేకపోయారు.

ఇదిలాఉంటే, రైళ్లలో ప్రయాణించే వయోవృద్ధులకు భారతీయ రైల్వే రాయితీ కల్పిస్తోన్న సంగతి తెలిసిందే. 50ఏళ్ల వయసు పైబడిన మహిళలకు 50శాతం రాయితీ కల్పిస్తుండగా.. 60 ఏళ్ల వయసు పైబడిన పురుషులకు మాత్రం 40శాతం రాయితీని భారతీయ రైల్వే అందిస్తోంది. మొత్తంగా 53 రకాల రాయితీలను కల్పిస్తోన్న రైల్వేకు ప్రతిఏటా దాదాపు 2వేల కోట్ల భారం పడుతున్నట్లు సమాచారం. వీటిలో సీనియర్‌ సిటిజన్ల కన్సెషన్‌ వల్లే ఎక్కువ భారం పడుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని