Railways: రైల్వే కొత్త ప్రయత్నం... ఇక ‘వందే భారత్‌’ సరకు రవాణా రైళ్లు

సరకు రవాణాను వేగవంతం చేసేందుకు రైల్వే (Indian Railway) శాఖ ప్రయత్నాలు చేస్తోంది. వందే భారత్‌ (Vande Bharat Train) మోడల్‌లో ఈ రైళ్లను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.

Published : 12 Oct 2022 18:47 IST

దిల్లీ: రైల్వేల్లో ఎప్పటికప్పుడు కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే అత్యాధునిక సదుపాయాలతో ‘వందే భారత్‌’ సెమీ హైస్పీడ్‌ రైళ్లను ఇటీవల ప్రవేశపెట్టారు. దేశంలో మూడు వందే భారత్‌ రైళ్లు ఇప్పటికే పట్టాలపై పరుగులు తీస్తుండగా.. నాలుగో రైలును గురువారం ప్రారంభించనున్నారు. అయితే త్వరలోనే సరకు రవాణాకు కూడా ‘వందే భారత్‌’ తరహా రైళ్లను తీసుకురావాలని రైల్వే శాఖ యోచిస్తోంది. తక్కువ సమయంలో సరకు రవాణా చేసేందుకుగానూ ఈ హైస్పీడ్‌ పార్సిల్‌ రైలు సేవలను మొదలుపెట్టాలని భావిస్తున్నట్లు రైల్వే వర్గాల సమాచారం.

వందే భారత్‌ ప్లాట్‌ఫామ్‌పైనే పార్సిల్‌ రైళ్లను కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. తొలి దశలో భాగంగా దిల్లీ ఎన్‌సీఆర్‌ నుంచి ముంబయి వరకు సరకు రవాణా రైలును అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లేలా ఈ రైళ్లను తయారుచేస్తున్నారు. రైలులోని ఒక్కో కోచ్‌లో 1,800 మిల్లీమీటర్ల వెడల్పుతో ఉండే ఆటోమేటిక్‌ స్లైడింగ్‌ ప్లగ్‌ డోర్లు ఉంటాయట. పార్సిళ్లను సులువుగా లోడింగ్‌ / అన్‌లోడింగ్‌ చేసేలా రోలర్‌ ఫ్లోర్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేస్తారట.

నాలుగో వందే భారత్‌ రైలు ఎప్పుడంటే...

ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం నాలుగో వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రారంభించనున్నారు. దిల్లీ నుంచి హిమాచల్‌ ప్రదేశ్‌లోని అందౌరా రైల్వే స్టేషన్‌ మధ్య నడిచే ఈ రైలును.. ఉనా జిల్లాలో గురువారం ప్రధాని జెండా ఊపి ప్రారంభిస్తారు. బుధవారం మినహా వారానికి ఆరు రోజులు ఈ రైలు సేవలు అందుబాటులో ఉంటాయి. ఈ రైలుతో దిల్లీ - చండీగఢ్‌ మధ్య ప్రయాణ సమయం 3 గంటల కంటే తక్కువే ఉండనుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని