IRCTCలో టికెట్ల జారీ మరింత వేగవంతం.. నిమిషానికి 2.25 లక్షల టికెట్లు: వైష్ణవ్‌

రైల్వేల్లో(Indian railways) కీలక మార్పులు తీసుకొస్తున్నట్టు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌(Ashwini vaishnaw) వెల్లడించారు. టిక్కెట్ల జారీతో పాటు ఎంక్వైరీలలో వేగాన్ని ప్రస్తుతం ఉన్నదాని కంటే సుమారు పది రెట్లు పెంచడమే లక్ష్యమని తెలిపారు. 

Published : 03 Feb 2023 21:53 IST

దిల్లీ: భారతీయ రైల్వే వ్యవస్థ (Indian railways)ను మరింతగా బలోపేతం చేయనున్నట్టు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ (Ashwini vaishnaw) తెలిపారు. ఇందులో భాగంగా పలు కీలక చర్యలు తీసుకోనున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం IRCTCలో రైలు టికెట్ల జారీ చేసే సామర్థ్యం నిమిషానికి దాదాపు 25వేలు ఉండగా.. దాన్ని 2.25 లక్షలకు అప్‌గ్రేడ్‌ చేస్తామని చెప్పారు. అలాగే, ఎంక్వైరీల సామర్థ్యాన్ని 40 వేల నుంచి 4 లక్షలకు పెంచడమే లక్ష్యంగా నిర్దేశించుకుంటున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన దిల్లీలో మీడియాతో మాట్లాడారు.

‘‘2023-24 ఆర్థిక సంవత్సరంలో 7వేల కి.మీల మేర కొత్త రైల్వే ట్రాక్‌ల నిర్మాణం చేపట్టనున్నాం. ప్రయాణికుల రిజర్వేషన్‌ సిస్టమ్‌ బ్యాకండ్‌లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తాం. ప్రస్తుతం IRCTC టికెట్ల జారీ సామర్థ్యం నిమిషానికి 25వేలు ఉండగా.. దాన్ని 2.25 లక్షలకు అప్‌గ్రేడ్‌ చేస్తాం. అలాగే, ఎంక్వైరీలను 40వేల నుంచి 4లక్షలకు అప్‌గ్రేడ్‌ చేస్తాం. దేశవ్యాప్తంగా 2,000 రైల్వే స్టేషన్లలో 24 గంటల పాటు తెరిచి ఉండేలా ‘జన్ సువిధ’ కన్వీనియన్స్ షాప్‌లను నిర్మిస్తాం. 2022-23 ఏడాదిలో రోజుకు 12కి.మీ.ల చొప్పున మొత్తం 4,500 కి.మీల మేర రైల్వే ట్రాక్‌లు నిర్మించాలన్న లక్ష్యాన్ని అధిగమించాం. 2014కు ముందు ఇది రోజుకు 4 కి.మీలుగా మాత్రమే ఉండేది. వచ్చే ఏడాది 7,000 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే ట్రాక్‌లను ఏర్పాటు చేయాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది’’ అని అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు.

రాబోయే ఆర్థిక సంవత్సరానికి ఇటీవల ప్రతిపాదించిన బడ్జెట్‌లో రైల్వేకు ఈసారి కేంద్రం భారీగా కేటాయింపులు జరిపింది. గత బడ్జెట్‌లో రూ.1.4 లక్షల కోట్లు కేటాయించగా.. ఈసారి ఏకంగా రూ.2.40 లక్షలు కోట్లకు పెంచడం విశేషం. 2013-14లో జరిపిన కేటాయింపులతో పోలిస్తే ఇది 9 రెట్లు అధికమని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్‌కు చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని