Indian Railways: ఆరేళ్లలో 3.5 లక్షల ఉద్యోగాలు.. ఈ ఒక్క ఏడాదే 18 వేలు..!

ఆరేళ్ల కాలంలో భారత రైల్వే కింద మూడున్నర లక్షల మందికిపైగా ఉద్యోగం పొందారని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.

Published : 06 Aug 2022 01:26 IST

దిల్లీ: ఆరేళ్ల కాలంలో భారత రైల్వే కింద మూడున్నర లక్షల మందికిపైగా ఉద్యోగం పొందారని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన ప్రశ్నకు ఈ సమాధానం ఇచ్చారు. దేశ యువతకు ఉపాధి కల్పించడంలో రైల్వేశాఖ కీలకపాత్ర పోషిస్తోందని, ఈ ఒక్క ఏడాదే 18 వేల ఉద్యోగాలు అందించిందని చెప్పారు. 

‘2014 నుంచి 2022 మధ్య భారత రైల్వే కింద 3,50,204 మందికి ఉద్యోగం లభించింది. ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను భర్తీ చేస్తూ.. ఏడాదిన్నరలో 10 లక్షల ఉద్యోగాలు కల్పించాలని కొద్దినెలల క్రితం ప్రధాని మోదీ కీలక ఆదేశాలు ఇచ్చారు. ఆ విషయంలో రైల్వే కీలక పాత్ర పోషిస్తోంది. దానికింద 1.4 లక్షల ఉద్యోగాలు భర్తీకానున్నాయి. ఈ ఒక్క ఏడాదే 18 వేల మందికి ఉపాధి కల్పించాం. 1.4 లక్షల ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైంది. త్వరలో పూర్తవుతుంది. కొంతమంది 10 వేలు, 20 వేలకే పెద్ద ప్రకటనలు చేస్తారు. కానీ మేం వాస్తవంలో భర్తీలు చేపడుతున్నాం’ అని మంత్రి వెల్లడించారు. ‘భారత రైల్వే అనేది భారీ స్థాయి సంస్థ. పదవీ విరమణ, రాజీనామాలు, మరణాల కారణంగా ఖాళీలు ఏర్పడుతుంటాయి. వాటి భర్తీ నిరంతరం కొనసాగుతుంది’ అని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని