Lok Sabha: 535 మంది ఎంపీల ప్రమాణం పూర్తి.. నినాదాలతో హోరెత్తించిన సభ్యులు!

18వ లోక్‌సభకు సంబంధించి రెండు రోజుల్లో మొత్తం 535 మంది ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు.

Published : 25 Jun 2024 22:53 IST

దిల్లీ: లోక్‌సభ (18వ) తొలి సమావేశాల రెండో రోజైన మంగళవారం కూడా ఎంపీల ప్రమాణ కార్యక్రమం కొనసాగింది. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌, డింపుల్‌ యాదవ్, భాజపా నేత హేమామాలిని, డీఎంకే నేత కనిమొళి, 17వ లోక్‌సభకు స్పీకర్‌గా ఉన్న ఓం బిర్లా తదితరులు ప్రమాణం చేసినవారిలో ఉన్నారు. సోమ, మంగళవారాల్లో కలిపి మొత్తం 535 మంది ఈ ప్రక్రియ పూర్తిచేయగా చేయగా.. ఇంకా ఏడుగురు మిగిలి ఉన్నారు.

స్పీకర్‌ ఎన్నిక ఎలా జరుగుతుంది? ఆ పదవికి ఎందుకంత ప్రాధాన్యం?

మహారాష్ట్రలోని నందుర్బార్ కాంగ్రెస్ ఎంపీ గోవాల్ కగదా పడావీతో రెండో రోజు ప్రమాణాలు మొదలయ్యాయి. కొంతమంది ప్రతిపక్ష ఎంపీలు రాజ్యాంగ ప్రతిని చేతపట్టుకుని ప్రమాణం చేశారు. రాహుల్‌ గాంధీ ‘జై హింద్, జై సంవిధాన్ (రాజ్యాంగం)’ నినాదాలు చేశారు. కొందరు ఇతరత్రా వ్యాఖ్యలు చేయగా.. ప్రొటెం స్పీకర్ వారించారు. రాసి ఇచ్చిన దానిని మాత్రమే చదవాలని పలు సందర్భాల్లో గుర్తుచేశారు.

  • ఓం బిర్లా ప్రమాణ స్వీకారం చేసేందుకు వచ్చినప్పుడు.. సభకు అధ్యక్షత వహిస్తున్న రాధామోహన్ సింగ్ లేచి నిలబడి ఆయనకు అభివాదం చేశారు.
  • ఉత్తర్‌ప్రదేశ్‌లోని నగీనా నుంచి ఎన్నికైన ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరామ్) ఎంపీ చంద్రశేఖర్‌ నినాదాల జాబితా సుదీర్ఘంగా ఉంది. రాజ్యాంగ ప్రతిని పట్టుకుని జై భీం, జై భారత్, జై సంవిధాన్, జై మండల్, జై జోహార్, జై జవాన్, జై కిసాన్ అని అన్నారు.
  • ఎన్సీపీ (ఎస్పీ) ఎంపీ సుప్రియా సూలే ప్రమాణం అనంతరం ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ పాదాలకు నమస్కరించారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నుంచి ఆశీర్వాదాలు తీసుకున్నారు.
  • డింపుల్ యాదవ్, అక్షయ్ యాదవ్, ఉత్కర్ష్ వర్మ తదితర ఎస్పీ ఎంపీలు సోషలిజం నినాదాలు చేశారు. పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్‌, ప్రస్తుత అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌లను గుర్తుచేసుకున్నారు.
  • యూపీలోని బరేలీ ఎంపీ ఛత్రపాల్ సింగ్ గంగ్వార్ ‘హిందూ రాష్ట్ర’ అంటూ నినాదాలు చేయడాన్ని ప్రతిపక్ష నేతలు తప్పుపట్టారు.
  • ‘మైనారిటీలు, దళితులు, ఆదివాసులపై జరుగుతున్న దౌర్జన్యాలను ఆపండి’ అని తమిళనాడులోని తిరువల్లూరుకు చెందిన కాంగ్రెస్ ఎంపీ శశికాంత్ సెంథిల్ వ్యాఖ్యానించారు.
  • మణిపుర్‌కు చెందిన ఇద్దరు కాంగ్రెస్‌ ఎంపీలు అంగోమ్చా బిమోల్‌ అకోయ్‌జామ్‌, ఆల్ఫ్రెడ్‌ ఎస్‌ ఆర్థర్‌ల ప్రమాణ స్వీకార సమయంలో సభలో మణిపుర్‌ నినాదాలు వినిపించాయి. ‘‘మణిపుర్‌కు న్యాయం చేకూర్చండి. దేశాన్ని కాపాడండి’’ అని ఆర్థర్‌ పేర్కొన్నారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని