Rajasthan: రాష్ట్రపతి పాదాలు తాకేందుకు ప్రయత్నించిన.. ప్రభుత్వ ఇంజినీర్‌ సస్పెన్షన్‌

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (Droupadi Murmu) పర్యటనలో ప్రొటోకాల్‌ను ఉల్లంఘించిన ఓ అధికారినిపై సస్పెన్షన్‌ వేటు పడింది. రాజస్థాన్‌కు చెందిన ఓ మహిళా ఇంజినీర్‌.. రాష్ట్రపతి పాదాలు తాకేందుకు ప్రయత్నించడాన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం.. ఈ చర్యలు తీసుకుంది.

Published : 14 Jan 2023 17:41 IST

దిల్లీ: ప్రముఖుల పర్యటనల్లో ఇటీవల కొన్ని అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. భద్రతా వలయాలను ఛేదించుకొని ప్రధాని మోదీ (Narendra Modi)కి పూలమాల వేసేందుకు ఇటీవల ఓ బాలుడు ప్రయత్నించి కలకలం సృష్టించాడు. అంతకు కొన్నిరోజుల ముందే రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (Droupadi Murmu) పర్యటనలోనూ ఈ తరహా ఘటనే జరిగింది. రాష్ట్రపతి పాదాలకు నమస్కరించేందుకు ప్రయత్నించిన ఓ ప్రభుత్వ మహిళా ఇంజినీర్‌ తాజాగా సస్పెన్షన్‌కు గురయ్యారు.

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జనవరి 3, 4 తేదీల్లో రాజస్థాన్‌లో పర్యటించారు. అందులో భాగంగా రోహెత్‌లోని స్కౌట్‌ గైడ్‌ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సమయంలో ప్రజారోగ్య విభాగంలో ఇంజినీర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తోన్న అంబా సియోల్‌.. సభా ప్రాంగణంలో నీళ్లను అందించే బాధ్యతలు చూస్తున్నారు. రాష్ట్రపతికి ఆ ప్రాంగణానికి చేరుకున్న సమయంలో స్వాగతం పలికేందుకు అధికారులు వేచిచూస్తున్నారు. రాష్ట్రపతి చేరుకోగానే.. ప్రొటోకాల్‌ ఉల్లంఘించి అడుగు ముందుకేసిన ఆ అధికారిని రాష్ట్రపతి పాదాలకు నమస్కరించేందుకు ప్రయత్నించారు. అయితే, రాష్ట్రపతి వ్యక్తిగత సిబ్బంది ఆమెను అడ్డుకున్నారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన కేంద్ర హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి నివేదికను కోరింది. స్థానిక పోలీసులు కూడా దర్యాప్తు చేపట్టారు. ఈ వ్యవహారంపై చర్యలు చేపట్టిన రాజస్థాన్‌ ప్రభుత్వం.. రాజస్థాన్‌ సివిల్‌ సర్వీసెస్‌ నియమాల ప్రకారం, సదరు ఇంజినీర్‌ను తక్షణమే సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు