
Ventilators: లోపాలున్నవి ఇచ్చారు.. దర్యాప్తు చేయండి
కేంద్రాన్ని డిమాండ్ చేసిన రాజస్థాన్ ముఖ్యమంత్రి
జైపూర్: సరిగా పనిచేయని, లోపభూయిష్టమైన వెంటిలేటర్లను కేంద్రం తమ రాష్ట్రానికి అందించిందని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ఆరోపించారు. పీఎంకేర్స్ నిధుల ద్వారా సేకరించిన ఈ వెంటిలేటర్లపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సమగ్రంగా దర్యాప్తు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. రెండోదశ కొవిడ్ ఉద్ధృతి..వెంటిలేటర్లు, ఐసీయూల్లో చికిత్స తీసుకునే బాధితుల సంఖ్యను పెంచుతోంది. ఈ క్రమంలో రాష్ట్రాలకు కేంద్రం వెంటిలేటర్లను సరఫరా చేస్తోంది.
‘పీఎంకేర్స్ నిధుల ద్వారా 1,900 వెంటిలేటర్లను కేంద్రం రాష్ట్రానికి అందించింది. వాటి నిర్వహణ బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. ఈ వెంటిలేటర్లలో చాలా వరకు సాంకేతికపరమైన లోపాలు వెలుగుచూశాయని వైద్యులు చెప్తున్నారు. ప్రెజర్ డ్రాప్ సమస్య ఉందని.. 1-2 గంటల పాటు అవి నిరంతరంగా పనిచేస్తే ఆ వెంటనే మొరాయిస్తున్నాయని తెలిపారు. ఆక్సిజన్ సెన్సర్లు, కంప్రెసర్ల వైఫల్యం వంటి సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. అవి రోగులకు ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయి’ అని గహ్లోత్ ట్విటర్‌లో కేంద్రానికి వెల్లడించారు. ఏప్రిల్ 5న కొవిడ్ సమీక్షా సమావేశంలో ఉదయ్‌పూర్ వైద్య కళాశాల ప్రిన్సిపల్ లఖన్ పోశ్వాల్ వెంటిలేటర్ల సమస్యను లేవనెత్తారని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించే ఉద్దేశంతో కేంద్రానికి లేఖలు రాసినట్లు తెలిపారు.
అలాగే రాజస్థాన్‌లోని వెంటిలేటర్ల నిర్వహణ కోసం 11 మందిని పంపుతామని కేంద్రం నియమించిన సంస్థ తెలిపిందని, ఆరుగురు మాత్రమే అందుబాటులో ఉన్నారని ఆయన అన్నారు. వారి అనుభవలేమి వైద్యులను అసంతృప్తికి గురిచేస్తోందని అసహనం వ్యక్తం చేశారు. అలాగే బాధితుల ప్రాణాల మీదకు తెచ్చే ఈ వెంటిలేటర్ల సేకరణపై వెంటనే దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. రాజస్థాన్‌తో పాటు మధ్యప్రదేశ్, పంజాబ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో కూడా ఈ సమస్య తలెత్తినట్లు వార్తా కథనాలు వెల్లడిస్తున్నాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.