Gehlot: ‘నా ప్రభుత్వం కూలిపోకుండా.. వసుంధర రాజే కాపాడారు!’

రాజస్థాన్‌లో 2020లో తన ప్రభుత్వం కూలిపోకుండా మాజీ సీఎం, భాజపా నేత వసుంధర రాజే సహకరించారని ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ తాజాగా వెల్లడించారు. మరోవైపు ఆ సమయంలో భాజపా నుంచి డబ్బు తీసుకున్న నేతలు తిరిగి ఇచ్చేయాలని సూచించారు.

Published : 08 May 2023 01:38 IST

జైపుర్: సచిన్‌ పైలట్‌ (Sachin Pilot)తోసహా పలువురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల తిరుగుబాటుతో 2020లో రాజస్థాన్‌ (Rajasthan)లో అశోక్‌ గహ్లోత్‌ (Ashok Gehlot) ప్రభుత్వం ప్రమాదంలో పడిన విషయం తెలిసిందే. అయితే, ఆ సమయంలో రాష్ట్ర మాజీ సీఎం, భాజపా నేత వసుంధర రాజే (Vasundhara Raje), మరో ఇద్దరు నేతలు తన ప్రభుత్వాన్ని కాపాడటంతో సాయం చేశారని ముఖ్యమంత్రి గహ్లోత్‌ తాజాగా వెల్లడించారు. ఓ సభలో గహ్లోత్‌ ఈ మేరకు మాట్లాడారు.

‘కేంద్ర మంత్రులు అమిత్ షా, గజేంద్ర సింగ్ షెకావత్, ధర్మేంద్ర ప్రధాన్‌లు కలిసి 2020లో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కుట్ర పన్నారు. ఈ క్రమంలో కొంతమంది ఎమ్మెల్యేలకు డబ్బు ఎరగా వేశారు. అయితే.. భాజపా నేతలు వసుంధర రాజే, మాజీ స్పీకర్ కైలాశ్‌ మేఘ్‌వాల్, ఎమ్మెల్యే శోభారాణి కుష్వాహల వల్లే మా ప్రభుత్వం నిలిచింది. గతంలో భాజపా ప్రభుత్వాన్ని కూలదోయడాన్ని అన్యాయంగా భావించి.. పార్టీ రాష్ట్ర చీఫ్‌గా నేను గతంలో మద్దతు ఇవ్వలేదు. అదే విధంగా.. 2020లోనూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు రాజే, మేఘ్‌వాల్, కుష్వాహలు భాజపాకు మద్దతు ఇవ్వలేదు’ అని గహ్లోత్‌ పేర్కొన్నారు. కాంగ్రెస్‌ తనను మూడుసార్లు ముఖ్యమంత్రిని చేసిందని, ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడమే తన కర్తవ్యమని తెలిపారు.

2020లో రాజస్థాన్‌లో నెల రోజులపాటు సాగిన రాజకీయ సంక్షోభానికి కాంగ్రెస్‌ పార్టీ హైకమాండ్ జోక్యంతో తెరపడిన విషయం తెలిసిందే. తదనంతరం.. సచిన్‌ పైలట్‌ను ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి తొలగించారు. మరోవైపు.. గహ్లోత్‌, రాజేలు ఒకరి విషయంలో మరొకరు.. ముఖ్యంగా అవినీతి వ్యవహారాల్లో చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వారివారి పార్టీల్లోనే ఈ మేరకు విమర్శలు ఉన్నాయి. రాజే ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకోవాలని ఇటీవల పైలట్‌ దీక్ష కూడా చేపట్టారు. అయితే, పరస్పర సహకార ఆరోపణలను ఇరు నేతలు కొట్టిపారేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని